- ఆరోగ్య కారణాలవల్లేనని బీజేపీ వర్గాల వెల్లడి
- ఈ నెలాఖరులో బాల రాముడిని దర్శించుకుంటారని వివరణ
- మురళీ మనోహర్ జోషి హాజరు కూడా సందేహమే
అయోధ్యలో రాముడికి గుడి కట్టాల్సిందేనని పోరాడిన బీజేపీ సీనియర్ నేతలు ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి.. రామ మందిరం కోసం పాటుపడిన ఈ ఇద్దరు నేతలూ నేడు అయోధ్యలో జరుగుతున్న వేడుకలకు దూరంగా ఉన్నారు. ప్రాణప్రతిష్ఠ వేడుకలకు అద్వానీ హాజరు కావడంలేదని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. మురళీ మనోహర్ జోషి కూడా హాజరవడం సందేహమేనని తెలిపాయి. ఢిల్లీలో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉండడంతో తన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అద్వానీ తన అయోధ్య ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నట్లు పేర్కొన్నాయి.
రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలకు రావాలంటూ అద్వానీ, జోషిని విశ్వ హిందూ పరిషత్ గతేడాది డిసెంబర్ లోనే ఆహ్వానించింది. ఈ నెలాఖరులోగా బాల రాముడిని అద్వానీ దర్శించుకుంటారని విశ్వ హిందూ పరిషత్ నేత ఒకరు మీడియాకు తెలిపారు. బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 లక్షల ఆలయాల్లో వేడుకలు జరుగుతున్నాయని విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్ తెలిపారు. దాదాపు 60 దేశాల్లో వీహెచ్ పీ, హిందూ సంఘాల ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహిస్తున్నట్టు వివరించారు.