- అయోధ్యలో బాలక్ రామ్ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ
- బాబర్ కాలంలో ఏర్పడిన లోతైన గాయానికి కుట్టు వంటిదన్న అమిత్ షా
- మోదీ మహత్తర ఘట్టంలో పాల్గొన్నారని కితాబు
- రామ భక్తులు ఈ క్షణాల కోసమే వేచి ఉన్నారని వెల్లడి
అయోధ్యలో రామ మందిర నిర్మాణం, బాలక్ రామ్ విగ్ర ప్రాణ ప్రతిష్ఠ తదితర అంశాలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు.
500 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులు ఈ క్షణాల కోసమే నిరీక్షించారని తెలిపారు. అయోధ్యలో కొలువైన రాముడు టెంట్ ఆలయం లోంచి ఎప్పుడు గర్భగుడిలోకి వెళతాడని గతంలో అడిగేవారని, జనవరి 22న జరిగిన చారిత్రాత్మక వేడుకే అందుకు సమాధానం అని వివరించారు.
అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన 500 ఏళ్ల క్రితం మొఘల్ పాలకుడు బాబర్ హయాంలో ఏర్పడిన లోతైన గాయానికి కుట్టు వంటిది అని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని పాల్గొనడం ఒక మహత్తర ఘట్టం అని అమిత్ షా పేర్కొన్నారు.
భారతదేశ మతవిశ్వాసాలు, సంస్కృతి-సంప్రదాయాలు, భాషలను గౌరవించడానికి 2014కి ముందున్న ప్రభుత్వాలు భయపడేవని వివరించారు. మోదీ వచ్చాక ఆ పరిస్థితి మారిందన్నారు.
అహ్మదాబాద్ లోని రణిప్ వద్ద శ్రీరామ మందిరాన్ని పునర్ నిర్మించగా, ఈ ఆలయంలోనూ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు హాజరైన సందర్భంగానే అమిత్ షా పై వ్యాఖ్యలు చేశారు.