Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అయోధ్య వార్తలు

 ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం… అయోధ్యకు వాహనాల రాకపై తాత్కాలిక నిషేధం

  • భక్తుల రద్దీ దృష్ట్యా అయోధ్యకు వెళ్లే అన్ని వాహనాలపై నియంత్రణ
  • అన్ని వాహనాల ఆన్‌లైన్ బుకింగ్స్ రద్దు చేసిన అధికారులు
  • అయోధ్య రామమందిరం సెక్యూరిటీ సిబ్బందికి కూడా సవాలుగా మారిన భక్తుల తాకిడి

అయోధ్య రామమందిరానికి భక్తుల తాకిడి ఉద్ధృతస్థాయిలో కొనసాగుతోంది. మొదటి రోజు అంచనాలకు మించి రామభక్తులు ఆలయానికి పోటెత్తారు. అక్కడక్కడా చిన్నపాటి తోపులాటలు, తొక్కిసలాటలు జరిగాయి. ఎవరికీ ఎలాంటి హానీ జరగకపోయినప్పటికీ ఆలయంలో మోహరించిన సెక్యూరిటీ సిబ్బందికి కూడా అక్కడి పరిస్థితులు సవాలుగా మారాయి. దీంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. అయోధ్యకు వెళ్లే వాహనాలను అధికారులు అడ్డుకుంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అయోధ్యకు వచ్చే అన్ని వాహనాలను మరికొన్ని రోజులపాటు నిలిపివేయాలని నిర్ణయించారు. 

సోమవారం ప్రాణప్రతిష్ఠ జరగగా మంగళవారం పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి పోటెత్తారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతా ఏర్పాట్లకు సవాలుగా మారింది. దీంతో సీఎం యోగి ఆదిత్యనాథ్ పరిస్థితిని సమీక్షించారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా అక్కడి పరిస్థితులు తెలుసుకున్నారు. రద్దీని గమనించిన ఆయన అయోధ్య వచ్చే యాత్రికుల రాకపోకలను నియంత్రించాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు కీలక సూచనలు చేశారు. దీంతో రానున్న కొన్ని రోజులపాటు అయోధ్యకు వెళ్లే అన్ని వాహనాలపై నిషేధం విధించాలని అధికారులు నిర్ణయించారు. వాహనాలకు సంబంధించి అన్ని ఆన్‌లైన్ బుకింగ్‌లను రద్దు చేశారు. ఇందుకు సంబంధించిన బుకింగ్ ఛార్జీలను రిఫండ్‌ చేస్తామని తెలిపారు. కాగా మంగళవారం ఉదయం నుంచి సామాన్య భక్తులకు బాల రాముడి దర్శన భాగ్యం కల్పించిన విషయం తెలిసిందే.

Related posts

అయోధ్య రామ మందిరంపై అమిత్ షా స్పందన

Ram Narayana

అయోధ్య వేడుకలకు అద్వానీ దూరం.. ఎందుకంటే..!

Ram Narayana

ఇకపై మన బాలరాముడు టెంట్ లో ఉండాల్సిన అవసరంలేదు: ప్రధాని మోదీ

Ram Narayana

Leave a Comment