- మా కుటుంబం చీలిపోవడం జగన్ చేతులారా చేసుకున్నదేనన్న షర్మిల
- జగన్ కు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు అండగా నిలబడ్డానని వ్యాఖ్య
- బీజేపీకి జగన్ బానిసలా మారిపోయారని విమర్శ
తన అన్న, ఏపీ సీఎం జగన్ పై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ కుటుంబం చీలిపోవడానికి జగనే కారణమని ఆమె అన్నారు. దీనికి సాక్ష్యం ఆ దేవుడు, తన తల్లి విజయమ్మ అని చెప్పారు. కుటుంబం విడిపోవడం అనేది జగనన్న చేతులారా చేసుకున్నదే అని అన్నారు. వైసీపీ కోసం తాను నెలల తరబడి 3,200 కిలోమీటర్ల పాదయాత్ర చేశానని, తెలంగాణలో ఓదార్పు యాత్రను చేపట్టానని చెప్పారు. స్వలాభం కోసం చూసుకోకుండా ఎప్పుడు అవసరమొస్తే అప్పుడు జగనన్నకు అండగా నిలబడి ప్రచారం చేశానని తెలిపారు.
తన కుటుంబం చీలిపోతుందని తెలిసి కూడా తాను కాంగ్రెస్ లో చేరానని చెప్పారు. వైసీపీ నేతలు తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ, విమర్శిస్తారని తనకు తెలుసని అన్నారు. రాష్ట్రాన్ని, తన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ చీల్చిందంటూ జగన్ నిన్న విమర్శలు గుప్పించిన నేపథ్యంలో… షర్మిల ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ నిన్న పెద్దపెద్ద మాటలు మాట్లాడారని.. ప్రభుత్వ డబ్బు ఖర్చు పెట్టి నిర్వహించిన సదస్సులో ఏదేదో మాట్లాడారని విమర్శించారు.
రాజధాని విషయంలో రాష్ట్రాన్ని జగన్ గందరగోళంలో పడేశారని షర్మిల దుయ్యబట్టారు. ఇప్పుడు ఏపీకి ఎన్ని రాజధానులో కూడా తెలియని పరిస్థితి ఉందని విమర్శించారు. బీజేపీకి జగన్ బానిసలా మారిపోయారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి బానిసగా మారి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను పణంగా పెట్టారని మండిపడ్డారు.
నాన్న వైఎస్సార్ పేరును జగన్ పూర్తిగా చెడగొట్టాడు: వైఎస్ షర్మిల
- వైసీపీ ప్రభుత్వంలో వైఎస్సార్ ఆనవాళ్లు కనిపించడం లేదన్న షర్మిల
- ఐదేళ్ల పాలనలో ఏపీని నాశనం చేశాడని మండిపాటు
- నియంత మాదిరి పెద్దపెద్ద కోటలు కట్టుకున్నాడని విమర్శ

ఏపీ ముఖ్యమంత్రి, తన అన్న జగన్ పై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో వైఎస్సార్ ఆనవాళ్లు కనిపించడం లేదని ఆమె అన్నారు. సంక్షేమ పథకాలకు జగన్ తూట్లు పొడిచారని చెప్పారు. రాజశేఖరరెడ్డి పాలనకు, జగన్ పాలనకు పొంతనే లేదని అన్నారు. నాన్న పేరును జగన్ పూర్తిగా చెడగొట్టాడని మండిపడ్డారు. ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశాడని అన్నారు. తనకు వ్యక్తిగతంగా నష్టం చేసినా… ప్రజలకు మేలు చేస్తాడని భరించానని… అయినా అలా జరగలేదని మండిపడ్డారు.
పోలవరం ప్రాజెక్ట్ అనేది వైఎస్సార్ కల అని షర్మిల చెప్పారు. 1941లోనే దాన్ని నిర్మించాలనుకున్నప్పటికీ ఏ నాయకుడు సాహసం చేయలేదని అన్నారు. వైఎస్సార్ సీఎం అయిన 6 నెలల్లోనే పోలవరం ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేశారని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ పై జగన్ ఏం సమాధానం చెపుతారని ప్రశ్నించారు. 2021లో పోలవరంను పూర్తి చేస్తానని చెప్పిన జగన్… ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. వైఎస్ ప్రభుత్వంలో వ్యవసాయం పండుగైతే… ఇప్పుడు దండగ అని అన్నారు.
జగన్ ఒక నియంత మాదిరి పెద్దపెద్ద కోటలు కట్టుకున్నారని షర్మిల విమర్శించారు. ఎమ్మెల్యేలకు కూడా ఆయన కనిపించరని దుయ్యబట్టారు. ఎంతో మంది కష్టపడి, త్యాగాలు చేస్తేనే జగన్ సీఎం అయ్యాడని చెప్పారు. పక్కన ఉన్న అందరినీ దూరం చేసుకుంటున్నాడని అన్నారు. వైఎస్ ప్రభుత్వానికి, జగన్ ప్రభుత్వానికి నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని చెప్పారు. జగన్ కోసం రాజీనామా చేసిన 18 మందిలో ఎంత మందిని మంత్రులను చేశాడని ప్రశ్నించారు.