- ఈశాన్య రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర
- అచ్చం రాహుల్ గాంధీని తలపించేలా ఉన్న రాకేశ్ కుశ్వాలా
- రాహుల్ యాత్రలో అందరినీ ఆకర్షిస్తున్న కుశ్వాలా
- రాహుల్ బస్సులో ఉంటే డూప్ తో యాత్ర కొనసాగిస్తున్నారన్న అసోం సీఎం
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ఈశాన్య రాష్ట్రాల్లో కొనసాగుతోంది. అయితే, అసోంలో యాత్ర సందర్భంగా అక్కడి బీజేపీ ప్రభుత్వానికి, రాహుల్ గాంధీకి మధ్య ఉద్రిక్త పూరిత వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సంచలన ఆరోపణలు చేశారు.
భారత్ జోడో న్యాయ్ యాత్రలో రాహుల్ గాంధీకి డూప్ ను వినియోగిస్తున్నారని అన్నారు. “రాహుల్ చాలా వరకు తన బస్సులోనే ఉంటాడని కొందరు కాంగ్రెస్ నేతలు నాతో చెప్పారు. మరి యాత్రలో రాహుల్ లా కనిపించే వ్యక్తి ఎవరు?” అని సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రశ్నించారు. బస్సులో కూర్చుని రాహుల్ టీ, ఇతర చిరుతిండ్లను ఆస్వాదిస్తున్నట్టుంది అని వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీలా కనిపించే వ్యక్తి ఇతనే!
మధ్యప్రదేశ్ లోని భోపాల్ నగరానికి చెందిన రాకేశ్ కుశ్వాలా కాస్త రాహుల్ గాంధీని తలపించేలా ఉంటారు. రాకేశ్ కుశ్వాలా కూడా రాహుల్ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొంటున్నారు. రాహుల్ లా వైట్ టీషర్టు, నెరిసిన గడ్డంతో, ఒకే ఎత్తుతో కనిపించే రాకేశ్ కుశ్వాలా కాంగ్రెస్ యాత్రలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. రాహుల్ గాంధీకి తనకు పోలికలు ఉండడంపై కుశ్వాలా స్పందిస్తూ… దేశ ప్రజలు తనను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పోల్చడం సంతోషం కలిగిస్తోందని అన్నారు.