- బీఆర్ఎస్ ను ఒక కుటుంబం నడిపిస్తోందనే భావన ఉందన్న కేకే
- కొన్ని పొరపాట్ల వల్ల బీఆర్ఎస్ ఓడిపోయిందని వ్యాఖ్య
- తనకు బీఆర్ఎస్, కేసీఆర్ ఇచ్చిన గౌరవాన్ని మర్చిపోలేనన్న కేకే
రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. తన కూతురు, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మితో కలిసి ఆయన కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కేకే కలిశారు. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ సమక్షంలో కేకే కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ… బీఆర్ఎస్ పార్టీని ఒక కుటుంబం నడిపిస్తోందనే భావన ప్రజల్లో ఉందని చెప్పారు. ఏ పార్టీ అయినా క్యాడర్ ను దూరం చేసుకోకూడదని అన్నారు. సరిచేసుకోవాల్సిన తప్పులను బీఆర్ఎస్ సరిచేసుకోలేదని అన్నారు. కొన్ని పొరపాట్ల వల్ల బీఆర్ఎస్ ఓడిపోయిందని చెప్పారు. తెలంగాణ ఇస్తే పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తామని కేసీఆర్ చెప్పారని… ఆ మాట నిలబెట్టుకోలేదని అన్నారు. తనకు బీఆర్ఎస్, కేసీఆర్ ఇచ్చిన గౌరవాన్ని మర్చిపోలేనని చెప్పారు. ఇండియాలో కాంగ్రెస్ పార్టీనే గొప్ప పార్టీ అని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కేకే.. కాంగ్రెస్ లో చేరికపై చర్చ
- బీఆర్ఎస్ ను వీడిన రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు
- కాంగ్రెస్ లో చేరికపై రేవంత్ తో చర్చించిన కేకే
- కడియం శ్రీహరి కూడా పార్టీ మారుతున్నట్టు ప్రచారం
బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతూనే ఉన్నాయి. తాజాగా బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. బీఆర్ఎస్ లో అత్యున్నత పదవులు అనుభవించిన కేకే… ఆ పార్టీని వీడుతారని ఎవరూ ఊహించలేదు. కాసేపటి క్రితం ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. కాంగ్రెస్ లో చేరికపై వీరిద్దరూ చర్చించారు. చర్చల అనంతరం రేవంత్ నివాసం నుంచి కేకే వెళ్లిపోయారు. కేకే కూతురు, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నారు. పదేళ్ల తర్వాత కేకే తన సొంత గూడు కాంగ్రెస్ లోకి చేరబోతున్నారు.
నిన్న ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ కు వెళ్లి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కేకే భేటీ అయిన సంగతి తెలిసిందే. కేకే పార్టీ మారుతుండటంపై కేసీఆర్ సీరియస్ అయినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. పదేళ్లు అధికారాన్ని అనుభవించి ఇప్పుడు పార్టీ మారితే ప్రజలు ఏమనుకుంటారో ఆలోచించారా? అని కేసీఆర్ ప్రశ్నించినట్టు సమాచారం. దేనికీ సమాధానాలు ఇవ్వని కేకే… చివరకు తన కెరీర్ కాంగ్రెస్ లోనే ప్రారంభమయిందని, కాంగ్రెస్ లోనే చచ్చిపోతానని చెప్పి అక్కడి నుంచి వచ్చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరి కూడా పార్టీ మారుతున్నట్టు సంకేతాలు అందుతున్నాయి.