- గుడికి వెళ్తుండగా పోర్టులాండ్ ప్రాంతంలో ప్రమాదం
- ఆరేళ్ల హానిక అక్కడికక్కడే మృతి.. కోమాలోకి తల్లి
- కొణకంచిలో అలముకున్న విషాదం
అమెరికాలో నిన్న తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం కొణకంచికి చెందిన ఆరేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. గ్రామానికి చెందిన కమతం నరేశ్-గీతాంజలి దంపతులు పదేళ్లుగా అమెరికాలోనే ఉంటూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. వీరికి బాబు, పాప సంతానం. కుమార్తె హానిక (6) పుట్టిన రోజును పురస్కరించుకుని అందరూ కలిసి కారులో గుడికి బయలుదేరారు.
ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు పోర్టులాండ్ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ఘటనలో హానిక అక్కడికక్కడే మృతి చెందింది. గీతాంజలికి బలమైన గాయం కావడంతో కోమాలోకి వెళ్లిందని, ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉందని సమాచారం. విషయం తెలియడంతో స్వగ్రామం కొణకంచిలో విషాద ఛాయలు అలముకున్నాయి.