- సముద్రంలో చేపల వేటకు వెళ్లిన సమయంలో దుర్ఘటన
- ప్రమాద సమయంలో పడవలో 130 మంది
- బోటు సామర్థ్యానికి మించి ప్రయాణించడంతో ప్రమాదం జరిగిందన్న అధికారులు
- మృతుల్లో అధిక సంఖ్యలో పిల్లలు
ఆఫ్రికా దేశం మొజాంబిక్ తీరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సముద్రంలో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తూ పడవ మునగడంతో 90 మందికి పైగా జల సమాధి అయ్యారు. కాగా, ప్రమాద సమయంలో పడవలో 130 మంది వరకు ఉన్నట్లు సమాచారం. బోటు సామర్థ్యానికి మించి ప్రయాణించడంతోనే ఈ దుర్ఘటన జరిగిందని అక్కడి అధికారులు వెల్లడించారు.
మృతుల్లో అధిక సంఖ్యలో పిల్లలు ఉన్నట్టు స్థానిక అధికారులు పేర్కొన్నారు. ఫెర్రీని చేపల పడవగా మార్చి అధిక సంఖ్యలో ప్రయాణించడంతోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ దుర్ఘటన గురించి తెలుసుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
మరోవైపు కలరా వ్యాప్తి అంటూ వదంతుల నేపథ్యంలో ప్రధాన ప్రాంతాల నుంచి ప్రజలు తప్పించుకుని దీవుల్లోకి వెళ్తున్నట్లు నాంపుల ప్రావిన్స్ సెక్రటరీ జైమ్ నెటో వెల్లడించారు. ఇలా వెళ్తుండగా ఈ పడవ మునిగిందని అన్నారు. ఇదిలాఉంటే.. మొజాంబిక్ దేశంలో గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటివరకూ 15 వేల కలరా కేసులు నమోదైనట్లు, అలాగే 32 మంది మరణించినట్లు అధికారిక గణాంకాలను బట్టి తెలుస్తోంది.