నాపై దయచూపండి.. పతంజలి కేసులో ఉత్తరాఖండ్ అధికారి చేతులు జోడించి వేడుకోలు
- ‘పతంజలి’ కేసులో ఉత్తరాఖండ్ డ్రగ్స్ నియంత్రణ సంస్థపై సుప్రీం కోర్టు ఆగ్రహం
- పతంజలి ఆయుర్వేద సంస్థపై చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ నిలదీత
- అయాయకులైన ప్రజల పరిస్థితి ఏంటని సూటి ప్రశ్న
పతంజలి ఆయుర్వేద సంస్థ తప్పుడు ప్రకటనల కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు బుధవారం ఉత్తరాఖండ్ డ్రగ్స్ లైసెన్సింగ్ అధికారులపై అగ్గిమీద గుగ్గిలమైంది. న్యాయమూర్తుల వరుస ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరైన రాష్ట్ర ఆహార ఔషధ నియంత్రణ సంస్థ జాయింట్ డైరెక్టర్ తనపై దయచూపాలంటూ ఒకానొక దశలో కోర్టులో చేతులు జోడించి వేడుకున్నారు.
కరోనిల్ టాబ్లెట్లు కరోనాకు చికిత్సగా పతంజలి ఆయుర్వేద ప్రకటనలు గుప్పించడాన్ని సుప్రీం కోర్టు తీవ్రంగా పరిగణించిన విషయం తెలిసిందే. ఈ కేసులో బాబా రామ్‌దేవ్ క్షమాపణలు కూడా అసంపూర్తిగా ఉన్నాయని కోర్టు ఇప్పటికే పలుమార్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
తాజాగా రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలిపైనా అగ్గిమీద గుగ్గిలమైంది. పతంజలి ఆయుర్వేద సంస్థపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. తనపై జాలి చూపాలన్న జాయింట్ డైరెక్టర్‌పై అగ్గిమీద గుగ్గిలమైంది. ‘‘ఎందుకు వదిలిపెట్టాలి? అసలు మీరు ఇప్పటివరకూ ఏ చర్యలు తీసుకున్నారు. నాపై దయ చూపించాలని ఓ వ్యక్తి అడుగుతున్నారు. మరి ఆ మందులు తీసుకున్న అమాయకుల పరిస్థితి ఏమిటి?’’ అని ప్రశ్నించింది.
అంతకుముందు, పతంజలి ఆయుర్వేద అధికారులపై కూడా మండిపడ్డ సుప్రీంకోర్టు.. డ్రగ్స్ అథారిటీకి చెందిన ముగ్గురు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. 2021లో ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటీసులను ప్రస్తావించిన కోర్టు దానికి అనుగుణంగా ఎందుకు చర్యలు తీసుకోలేదని జాయింట్ డైరెక్టర్‌ను ప్రశ్నించింది.