- దేశంలో 6జి టెక్నాలజీ అమలుకు ఏర్పాట్లు
- ఎలక్ట్రానిక్ హబ్ గా తీర్చిదిద్దుతామని వెల్లడి
- ప్రపంచ పర్యాటక కేంద్రంగా భారత్ ను మారుస్తామన్న మోదీ
ఎన్డీయే కూటమిని నడిపిస్తున్న బీజేపీ ఇవాళ తన ఎన్నికల మేనిఫెస్టో ‘సంకల్ప పత్ర’ను ప్రజల ముందుకు తీసుకువచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇందులోని కీలక అంశాలను వివరించారు. ప్రధానంగా దేశానికి మూలస్తంభాలు అనదగ్గ నాలుగు వర్గాలు యువత, మహిళలు, పేదలు, రైతులను సంతృప్తి పరిచేలా మేనిఫెస్టోకు రూపకల్పన చేసినట్టు తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఆదివారం బీజేపీ మేనిఫెస్టోను ఢిల్లీలో మోదీ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశాన్ని ఎలక్ట్రానిక్ హబ్ గా తీర్చిదిద్దుతామని చెప్పారు. పెట్రోల్ ధరలు తగ్గించడంతో పాటు ఆటో మొబైల్, సెమీ కండక్టర్, గ్రీన్ ఎనర్జీ, ఫార్మా రంగాల్లో దేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళతామని తెలిపారు. దేశంలో ఇప్పటికే 5జీ అమలు చేస్తున్నామని, త్వరలో 6జి అమలుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ప్రపంచ పర్యాటక కేంద్రంగా భారత్ ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తామని మోదీ పేర్కొన్నారు. ఏజెన్సీలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించి గిరిజనులకు మేలుకలిగేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.
అభివృద్ధికి, సంస్కృతికి బీజేపీ సమ ప్రాధాన్యం ఇస్తుందని మోదీ చెప్పారు. సోషల్, డిజిటల్, ఫిజికల్ రంగాల్లో మౌలిక వసతులు పెంచుతామని తెలిపారు. శాటిలైట్ పట్టణాల నిర్మాణం ఇప్పటికే మొదలుపెట్టామని గుర్తుచేశారు. వందేభారత్ స్లీపర్, వందేభారత్ మెట్రో, బుల్లెట్ రైళ్లను పట్టాలపై పరుగులు పెట్టిస్తున్నామని మోదీ వివరించారు. విమానయాన రంగాన్ని ప్రోత్సహించి, తద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నట్లు ప్రధాని మోదీ వివరించారు.
14 ముఖ్యమైన హామీలతో కూడిన బీజేపీ మేనిఫెస్టో నిశితంగా పరిశీలిస్తే… దూరదృష్టితో అనేక హామీలను పొందుపరిచినట్టు అర్థమవుతుంది. సీఏఏ, ఒక దేశం ఒకే ఎన్నిక, జాతీయ విద్యా విధానం, ఒలింపిక్ ఎన్నికల బిడ్డింగ్ వంటి అంశాలను మేనిఫెస్టోలో ప్రస్తావించారు.
బీజేపీ సంకల్ప పత్రలో ఉన్న కీలక అంశాలు…
- చైనా, పాకిస్థాన్, మయన్మార్ సరిహద్దుల పొడవునా మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగవంతం. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో సరిహద్దు కంచెల అభివృద్ధి.
- కేవలం ఒక్క దశాబ్ద కాలంలో భారత్ 11 నుంచి 5వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. ఇప్పుడు భారత్ ను ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలపడమే బీజేపీ లక్ష్యం.
- 2036 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కులు భారత్ చేజిక్కించుకునేందుకు ప్రణాళిక బద్ధ కృషి.
- సీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం) అమలుకు బీజేపీ కట్టుబడి ఉంది.
- రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 ప్రకారం ఉమ్మడి పౌర స్మృతి అమలు చేస్తాం.
- ఒకే దేశం ఒకే ఎన్నిక మా నినాదం… ఇప్పటికే దీని సాధ్యాసాధ్యాలపై కమిటీ వేశాం. కమిటీ సిఫారసులు వచ్చాక కార్యాచరణ ఉంటుంది.
- దేశంలో ఉన్నతస్థాయి విద్యాప్రమాణాలకు వేదికలుగా ఉన్న ఐఐటీ, ఐఐఎం, ఏఐఐఎంఎస్ వంటి జాతీయస్థాయి విద్యా సంస్థలను మరింత బలోపేతం చేస్తాం. వాటికి నిధుల కేటాయింపు, సామర్థ్యం పెంపు, మౌలికసదుపాయాల వృద్ధి, పరిశోధనలకు ప్రత్యేక నిధులు అందిస్తాం.
- పీఎం గరీబ్ కల్యాణ్ యోజన కింద మరో ఐదేళ్ల పాటు 80 కోట్ల మంది ప్రజలకు ఉచిత రేషన్.
- పేద కుటుంబాలకు పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద ఉచిత విద్యుత్ అందిస్తాం.
- పారిశ్రామిక, వాణిజ్య కేంద్రాల సమీపంలో మహిళల కోసం హాస్టళ్ల నిర్మాణం… మహిళల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత.
- పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీలు తదితర చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచడం కోసం నారీ శక్తి వందన్ అభియాన్ పథకం.
- నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందేలా ఆయుష్మాన్ భారత్ పథకం పరిధిలోకి దేశంలోని అందరు వృద్ధులు.
- రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద అందించే రూ.6000 ఆర్థికసాయం కొనసాగింపు.
తూర్పు, ఉత్తర, దక్షిణ భారతావనికి కూడా బుల్లెట్ రైళ్లు: ప్రధాని మోదీ
- అహ్మదాబాద్-ముంబయి మార్గంలో బుల్లెట్ రైలు పనులు
- మిగతా ప్రాంతాలకు కూడా బుల్లెట్ రైలు సేవల విస్తరణకు కట్టుబడి ఉన్నామన్న మోదీ
- ఇవాళ బీజేపీ మేనిఫెస్టో విడుదల సందర్భంగా వ్యాఖ్యలు
ప్రస్తుతం అహ్మదాబాద్-ముంబయి మార్గంలో బుల్లెట్ రైలు కారిడార్ పనులు జరుగుతున్నాయి. అయితే, తూర్పు, ఉత్తర, దక్షిణ భారతావనికి కూడా బుల్లెట్ రైళ్లు రానున్నాయని, త్వరలోనే సర్వే ప్రకియ ప్రారంభం అవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఇవాళ ఆయన బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన అనంతరం ఈ విషయం తెలిపారు. అహ్మదాబాద్-ముంబయి మార్గంలో బుల్లెట్ రైలు పనులు శరవేగంగా సాగుతున్నాయని, తూర్పు, ఉత్తర, దక్షిణ భారతదేశంలోనూ బుల్లెట్ రైలు సేవలు విస్తరించేందుకు బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అంతేకాదు, వందేభారత్ రైళ్ల సేవలను దేశంలోని ప్రతి మూలకు పొడిగిస్తామని చెప్పారు.