- గతనెల 15న కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు
- తల్లి శోభ, సోదరుడు కేటీఆర్, భర్త అనిల్ కుమార్ పరామర్శ
- ఒక్కసారి కూడా ప్రస్తావన తీసుకురాని కేసీఆర్
- రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ
- నేటితో ముగియనున్న సీబీఐ కస్టడీ
- 10 గంటలకు రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరు
ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయి నేటికి సరిగ్గా నెల రోజులు. జైలులో ఉన్న ఆమెను సోదరుడు కేటీఆర్, ఆమె భర్త, తల్లి శోభ కలిసినా, తండ్రి కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకు ఆమెను పరామర్శించకపోవడమే కాకుండా ఆ విషయాన్ని కూడా ఎక్కడా ప్రస్తావించకపోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను గత నెల 15న హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అంతకుముందు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. అప్పటి నుంచి ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. గత 20 రోజులుగా తీహార్ జైలులోనే ఉన్న కవితను ఇటీవల సీబీఐ అరెస్ట్ చేసి మూడు రోజులు విచారించింది. నేటితో ఆమె కస్టడీ ముగియనుండడంతో తిరిగి ఆమెను తీహార్ జైలుకు పంపనున్నారు.
ఉదయం 10 గంటలకు ఆమెను ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో అధికారులు హాజరుపరుస్తారు. ఈ సందర్భంగా కస్టడీ పొడిగించాలని సీబీఐ కోరే అవకాశం ఉంది. ఒకవేళ సీబీఐ కనుక కస్టడీ పిటిషన్ వేయకుంటే కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
సీబీఐ కేసులో కవితకు జ్యుడీషియల్ కస్టడీ.. ఇది బీజేపీ కస్టడీ అన్న కవిత
- 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని కోరిన సీబీఐ
- 9 రోజుల పాటు కస్టడీని ఇచ్చిన కోర్టు
- ఈ నెల 23 వరకు కస్టడీలో ఉండనున్న కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులో ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు జ్యుడీషియల్ కస్టడీని విధించింది. మరో 9 రోజుల పాటు కవితను కస్టడీకి పంపింది. 15 రోజుల పాటు కస్టడీని ఇవ్వాలని కోర్టును సీబీఐ కోరింది. అయితే 9 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి కోర్టు అనుమతించింది. దీంతో ఈనెల 23 వరకు ఆమె కస్టడీలో ఉండనున్నారు.
ఇటీవల సీబీఐకి మూడు రోజుల పాటు కవితను కస్టడీకి ఇచ్చిన సంగతి తెలిసిందే. మూడు రోజుల కస్టడీ ముగియడంతో ఆమెను సీబీఐ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో విచారణ సందర్భంగా… సాక్ష్యాలను కవిత ముందు ఉంచి ప్రశ్నించామని… ఆమె విచారణకు సహకరించలేదని కోర్టుకు సీబీఐ తెలిపింది. ఉద్దేశ పూర్వకంగా విచారణను తప్పుదోవ పట్టించేలా ఆమె సమాధానాలు చెప్పారని వెల్లడించింది. ఆమెను విచారించేందుకు మరింత సమయం కావాలని కోరింది. ఈ నేపథ్యంలో కవిత కస్టడీని కోర్టు పొడిగించింది.
మూడు రోజుల కస్టడీలో కేసులోని నిందితులు, అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చిన వాంగ్మూలం, వాట్సాప్ చాట్ పై కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. కవిత విచారణను సీబీఐ వీడియో రికార్డింగ్ చేసింది. లిక్కర్ స్కామ్ లో మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసింది. తీహార్ జైల్లో ఉన్న సమయంలోనే ఆమెను సీబీఐ అదుపులోకి తీసుకుంది.
మరోవైపు కోర్టు హాలు నుంచి బయటకు వస్తున్న సమయంలో అక్కడున్న మీడియాతో కవిత మాట్లాడుతూ… ఇది సీబీఐ కస్టడీ కాదని, బీజేపీ కస్టడీ అని అని అన్నారు. బీజేపీ నేతలు బయట మాట్లాడేవే… లోపల సీబీఐ అధికారులు అడుగుతున్నారని చెప్పారు. రెండేళ్ల నుంచి అడుగుతున్నదే అడుతుతున్నారని విమర్శించారు.