- కేజ్రీవాల్ షుగర్ లెవెల్స్ పెరిగేలా మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారన్న ఈడీ
- వాటి వల్ల బ్లడ్ షుగర్ పెరిగితే బెయిల్ అడగాలనేది కేజ్రీవాల్ ప్లానంటూ వ్యాఖ్య
- ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ డైట్ ఛార్ట్ సమర్పించాలని జైలు అధికారులకు న్యాయస్థానం ఆదేశం
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ షుగర్ లెవెల్స్ పెరిగేలా మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారని రౌస్ అవెన్యూ కోర్టుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. వాటి వల్ల బ్లడ్ షుగర్ పెరిగితే బెయిల్ అడగాలనేది కేజ్రీవాల్ ప్లాన్ అని పేర్కొంది. దీంతో కేజ్రీవాల్ డైట్ ఛార్ట్ సమర్పించాలని జైలు అధికారులను న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి వాదనలు శుక్రవారం వింటామని తెలిపింది. మరోవైపు ఈడీ వాదనను కేజ్రీవాల్ తరఫు న్యాయవాది వివేక్ జైన్ కొట్టిపారేశారు.
కాగా, ఇటీవల షుగర్ లెవెల్స్ పడిపోతున్నాయని క్రమం తప్పకుండా తనిఖీ చేసేందుకు వారానికి మూడుసార్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన వ్యక్తిగత వైద్యుడిని అనుమతి ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఇప్పుడు కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా మామిడిపండ్లు, స్వీట్లు తింటున్నారని, చక్కెరతో కూడిన టీ తాగుతున్నారని ఈడీ గురువారం రౌస్ అవెన్యూ కోర్టుకు తెలిపింది.