అకాల వర్షాలకు పంటల నష్టం జరిగింది …పరిహారం ఇస్తాము…మంత్రి తుమ్మల
7 జిల్లాలోని 2200 ఎకరాల పంటలను నష్టం జరిగినట్లు ప్రాధమిక నిర్దారణ …
పంట నష్టం అంచనాలను రూపొందించాలని అధికారులకు ఆదేశం …
ఇలాంటి సందర్భాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహనా కల్పించాలి ..
జిల్లా కలెక్టర్లు పంటనష్టం పై నివేదికలు సిద్ధం చేయాలి ..
రాష్ట్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు, వడగళ్ల వానల వల్ల పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నారాయణపేట, కామారెడ్డి, నిజామాబాద్, నాగర్ కర్నూల్, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట జిల్లాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక నివేదికలు అందాయని తెలిపారు. తాజాగా కురిసిన అకాల వర్షాలు, వడగళ్ల వానల ప్రభావం, సంభవించిన పంట నష్టంపై మంత్రి ఆరా తీశారు. దాదాపు 2200 ఎకరాల వరకు వరి, మొక్కజొన్న, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశామని చెప్పారు. పంట నష్టం సంభవించిన ప్రాంతాలను వెంటనే సందర్శించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పూర్తి స్థాయిలో పంట నష్టపోయిన రైతుల వివరాలు వెంటనే సేకరించాలని వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా వరి పంట కోతలు ఊపందుకున్న నేపథ్యంలో వచ్చే రెండు, మూడు వారాల పాటు అన్నదాతలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇలాంటి అకాల వర్షాలు సంభవించే సందర్భంలో పంట నష్టం తగ్గించే విధంగా ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కర్షకులకు సూచించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సంబంధిత జిల్లా స్థాయి అధికారులు సమన్వయం చేసుకుంటూ వ్యవసాయ మార్కెట్ యార్డులు, ఐకేపీ కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం బస్తాలు, ఇతర పంటలు తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. ఇందుకోసం రైతుల సౌకర్యార్థం ఇప్పటికే 2 లక్షలకు పైగా టార్పాలిన్ కవర్లను అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.