భట్టి చొరవతో యాదాద్రికి పర్యావరణ అనుమతులు
విద్యుత్ ఉత్పాదనపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
గత పాలకుల వైఫల్యాలను సవరించే దిశగా ప్రయత్నాలు
బాధ్యతలు చేపట్టిన నాటినుంచే యాదాద్రిపై ఉప ముఖ్యమంత్రి దృష్టి
త్వరితగతిని నిర్మాణానికి కృషి
యాదాద్రికి పర్యావరణ అనుమతులకై కాంగ్రెస్ సర్కార్ ప్రత్యేక కృషి
నల్లగొండ జిల్లా దామరచర్ల వద్ద తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణానికి 2017లోనే పర్యావరణ అనుమతులు మంజూరు అయ్యాయి. 50% విదేశీ బొగ్గు, 50% స్వదేశీ బొగ్గుతో దామరచర్లలో విద్యుత్ ఉత్పత్తి చేస్తామని 2017 జూన్ 15న నాటి ప్రభుత్వం కేంద్ర నుంచి పర్యావరణ అనుమతులు సాధించింది. అయితే అనుమతులకు విరుద్ధంగా అంటే.. నూరు శాతం స్వదేశీ బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తికి ఏర్పాటు చేసింది. మార్చిన టెక్నాలజీతో పర్యావరణం దెబ్బతింటుందని స్వచ్ఛంద సంస్థలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేశాయి. టెక్నాలజీకి అనుగుణంగా అనుమతులు పొందాలని 2022 సెప్టెంబర్ 30న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించి, అనుమతులు నిలిపేసింది. 2023 డిసెంబర్ 6 వరకు అధికారంలో ఉన్న గత పాలకులు పర్యావరణ అనుమతులు సాధించేందుకు ఎలాంటి చొరవ చూపలేదు.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టడం.. విద్యుత్ శాఖమంత్రిగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బాధ్యతలు తీసుకోవడంతో పరిస్థితుల్లో మార్పు కనిపించడం మొదలైంది. ప్రమాణ స్వీకారం చేసిన నాటినుంచి యాదాద్రిపై ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు. అందులో భాగంగా థర్మల్ ప్రాజెక్టు వాస్తవ పరిస్థితి, నిర్మాణ వ్యయం, కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇలా అన్ని అంశాలపై క్షుణ్ణంగా మూడునాలుగుసార్లు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు.
ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క పట్టు పట్టి. మారిన టెక్నాలజీకి అనుగుణంగా అనుమతులు సాధించేందుకు మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేయించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సూచించిన షరతులు అన్నిటిని పూర్తిచేసి రెండు నెలల కాలంలోనే అనుమతులు సాధించారు. ఫలితంగా 2025 ఫిబ్రవరి నాటికి 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అడ్డంకులు తొలగిపోయాయి.
యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణ వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు గత ఫిబ్రవరిలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో కలిసి క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు దామరచెర్ల వెళ్లారు. ప్లాంట్ పనులు, బొగ్గు తరలించేందుక రైల్వే ట్రాక్ నిర్మాణ పనులను పర్యవేక్షించిన విషయం విదితమే.
తాజాగా యాదాద్రికి గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులు మంజూరు కావడంతో విద్యుత్ ఉత్పత్తికి తెలంగాణ జెన్ కో సన్నాహకాలు చేస్తోంది. మొదటి రెండు యూనిట్లలో మొత్తంగా 1600 మెగావాట్ల విద్యుత్ ను జెన్ కో ఉత్పత్తి చేయనుంది.
ఏదేమైనా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి విద్యుత్ రంగంపై ప్రత్యేక దృష్టిని సారించింది. అందులో భాగంగానే యాదాద్రికి పర్యావరణ అనుమతులను కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిందని విద్యుత్ రంగ నిపుణులు, మేధావులు పేర్కొంటున్నారు.