Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

జగన్ ప్రభుత్వంపై ప్రధాని మోడీ విమర్శల దాడి…!కేంద్రంలోను, ఏపీలో ఎన్డీయే సర్కార్ అన్న మోడీ

వైసీపీ ప్రభుత్వ పనితీరుకు ఇదే పెద్ద ఉదాహరణ: అనకాపల్లిలో ప్రధాని మోదీ

  • అనకాపల్లిలో ప్రజాగళం సభ
  • హాజరైన ప్రధాని మోదీ, చంద్రబాబు
  • నూకాలమ్మ తల్లికి ప్రణామాలు అర్పించిన ప్రధాని మోదీ
  • అల్లూరి సీతారామరాజును స్మరించుకుంటూ ప్రసంగం ప్రారంభం
  • వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన ప్రధాని

అనకాపల్లి జిల్లా రాజుపాలెంలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభకు ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. ఈ సభలో మోదీ ప్రసంగిస్తూ, స్థానిక నూకాలమ్మ తల్లిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు అల్లూరి సీతారామరాజును స్మరించుకుంటున్నట్టు పేర్కొన్నారు. 

తాను సాయంత్రం 5.45 గంటలకు  వెళ్లిపోవాల్సి ఉందని, అందుకే ముందుగా ప్రసంగిస్తున్నాని, తాను వెళ్లిపోయిన తర్వాత కూడా ప్రజలు సభలో ఉండాలని, చంద్రబాబు ప్రసంగం వినాలని సూచించారు. 

“అనకాపల్లి బెల్లం, తెలుగు భాష రెండు కూడా మధురమైనవి, అద్భుతమైనవి. జూన్ 4న ఈ తియ్యదనం మరింత పెరగబోతోంది, ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం వస్తుంది, పార్లమెంటు ఎన్నికల్లోనూ ఎన్డీయే గెలవబోతోంది. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఎన్డీయే గెలవడం వల్ల డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుంది. తద్వారా అభివృద్ధి కొత్త ఎత్తులకు చేరుతుంది.

భారత్ ఇవాళ ఐదో అతి పెద్ద ఆర్థిక శక్తిగా అవతరించింది. చందమామ దక్షిణ భాగాన జెండా రెపరెపలాడించిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. ఏపీ నుంచి అనేకమంది ప్రవాసులు  విదేశాల్లో నివసిస్తున్నారు. భారత్ సాధించిన ఘనతతో ఇప్పుడు వారందరూ భారతీయులుగా ఎంతో గుర్తింపు పొందుతున్నారు. 

కాంగ్రెస్ పార్టీ, వైసీపీ రెండూ ఒకటే. కర్ణాటకలో ట్యాంకర్, భూ మాఫియా ప్రభుత్వం నడుస్తోంది… ఏపీలో శాండ్, ల్యాండ్ మాఫియా విజృంభిస్తున్నాయి. ఏపీలో దేవాలయాలపై దాడులు జరిగాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక దేవాలయాలకు రక్షణ కల్పిస్తాం. 

ఏపీ కోసం కేంద్రం అనేక కార్యక్రమాలు చేపట్టింది… కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం ఏమీ చేయడంలేదు. పైగా కేంద్ర పథకాలను వైసీపీ ప్రభుత్వం ముందుకు సాగనివ్వలేదు. కేంద్రం విశాఖ రైల్వే జోన్ కేటాయిస్తే, వైసీపీ ప్రభుత్వం అందుకు అవసరమైన భూమిని కూడా ఇవ్వలేదు. కేంద్రం భారీగా ఇళ్లు కేటాయించినా, ఈ ప్రభుత్వం నిర్మించలేదు.

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి జలవనరుల ప్రాజెక్టు వైసీపీ ప్రభుత్వ పనితీరుకు పెద్ద ఉదాహరణ. ఈ ప్రాజెక్టును నాడు జగన్ రెడ్డి తండ్రి ప్రారంభించారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందుకున్న జగన్, ఈ ప్రాజెక్టును మాత్రం పూర్తి చేయలేకపోయారు. పోలవరం ప్రాజెక్టును అడ్డుకుంటున్నారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.15 వేల కోట్లు ఇచ్చాం. వైసీపీ ప్రభుత్వానికి రైతుల గురించి పట్టింపే లేదు. 

ఎన్డీయే మంత్రం అభివృద్ధి… అభివృద్ధి… అభివృద్ధి. వైసీపీ మంత్రం అవినీతి… అవినీతి… అవినీతి! ఈ రోజున ఏపీలో అనేక పంచదార పరిశ్రమలు మూతపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల చెరకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డబుల్ ఇంజిన్ సర్కారుతో చెరకు రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతాం. 

మత్స్యకారులకు బీమా సౌకర్యం కల్పిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నాం. మత్స్యకారుల కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేశాం. విశాఖలో ఐఐఎం స్థాపించాం, ఈ ప్రాంతానికి పెట్రోలియం యూనివర్సిటీని తీసుకువచ్చాం, పూడిమడకలో గ్రీన్ ఎనర్జీ పార్క్ కు ఆమోదం లభించింది. 

నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ ప్రారంభించేందుకు రూ.1000 కోట్ల సాయం అందించాం. దీనివల్ల పెట్టుబడులు వస్తాయి, ఫార్మారంగంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అవినీతి ఎక్కడ ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉండదు. ఏపీలో అదే పరిస్థితి నెలకొని ఉంది. రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలి” అంటూ ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

వైసీపీ ప్రభుత్వం ఉంటే ఇలాంటి దుష్ఫలితాలే వస్తాయి: ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఈ సాయంత్రం రాజమండ్రి రూరల్ వేమగిరిలో కూటమి సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. 

నా ఆంధ్రా కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు, రాజమండ్రి వాసులందరికీ నమస్కారాలు, గోదావరి నదీ తల్లికి ప్రణామం చేస్తున్నాను అని తెలిపారు. ఆదికవి నన్నయ నడయాడిన నేల ఇది… ఇక్కడే ఆయన తెలుగులో తొలి కావ్యాన్ని రచించారు అని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ గడ్డ నుంచి కొత్త చరిత్ర ప్రారంభం కానుందని నాకు స్పష్టంగా తెలుస్తోందని మోదీ వివరించారు. 

“మే 13న మీ ఓటుతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి యాత్రలో కొత్త అధ్యాయం ప్రారంభం అవుతుంది. లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే విజయం తథ్యం. దాంతోపాటే ఏపీ అసెంబ్లీలో రానున్న ఐదేళ్లు ఎన్డీయే ప్రభుత్వం ఉండబోతోంది. నేను ఇవాళ ఒడిశా నుంచి వచ్చాను… అక్కడ కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దేశంలో ఎక్కడెక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయో, ప్రతి చోటా ఎన్డీయే ప్రభుత్వమే రాబోతోంది. 

ఈ ఎన్నికల్లో రెండు ప్రమాదాలు ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్ పార్టీ, మరొకటి వైసీపీ. కాంగ్రెస్ నేతలు ఎన్నికల ఫలితాలు రాకముందే ఓటమిని అంగీకరించారు. ఏపీలో ఉన్న ప్రజానీకం వైసీపీని పూర్తిగా తిరస్కరించింది. ఏపీలో వైసీపీకి ఐదేళ్లు అవకాశం లభించింది. కానీ ఈ ఐదేళ్లలో వారు పూర్తిగా వృథా చేశారు. ఏపీ అభివృద్థిని తిరోగమనంలో తీసుకెళ్లారు. 

గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఏపీని అభివృద్ధి పథంలో తీసుకెళ్లింది. అన్నింట్లోనూ రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిపింది. కానీ వైసీపీ ప్రభుత్వం ఈ అభివృద్ధి బండిని పట్టాలు తప్పించింది. ఈ ప్రభుత్వం ప్రజల మేలు కోసం పనిచేయడానికి బదులు, రాష్ట్రాన్ని భారీ అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసింది. అందుకే ఇవాళ దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధిని సాధించడానికి ఉన్న ఏకైక గ్యారెంటీ ఎన్డీయే. 

ఏపీలో యువత ప్రతిభావంతమైనది. టెక్నాలజీలో ఏపీ యువత శక్తిని యావత్ ప్రపంచం గుర్తించింది. ఈ దేశం వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో ఏపీ కూడా అంతే వేగంగా అభివృద్ధి చెందడం ఎంతో అవసరం. కానీ ఏపీ ప్రభుత్వం నుంచి ఇలాంటి అభివృద్ధిని ఆశించడం పూర్తిగా వృథా. ఏపీలో అభివృద్ధి జీరో… అవినీతి మాత్రం 100 శాతం. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను ఆలస్యం చేశారు. అందుకే డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు ఉండాలని చెబుతున్నాం. ఆగిపోయిన పనులు మళ్లీ ప్రారంభం కావాలంటే కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉండాలి. 

ప్రజలు కాంగ్రెస్ విషయంలోనూ అంతే జాగ్రత్తగా ఉండాలి. పదేళ్లకు ముందు కాంగ్రెస్ దేశాన్ని ఏ విధంగా అధోగతి పాల్జేసిందో అందరూ గమనించాలి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు స్కాముల గురించి తప్ప మరొక చర్చ ఉండేది కాదు. కాంగ్రెస్ నేతలు, ఈ ఇండియా కూటమి నేతలు ప్రతి రోజూ ఈడీపై గగ్గోలు పెడుతుంటారు. ఎందుకు వాళ్లు అంత అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారో అందరికీ తెలుసు. 

ఝార్ఖండ్ లో ఈడీ ఒక డబ్బు కట్టల కొండను వెలికితీసింది. మంత్రి కార్యదర్శి ఇంట్లో కట్టలుకట్టలుగా డబ్బు బయటపడింది. కాంగ్రెస్ నేతలు వారి ఇళ్లలో నల్ల డబ్బును దాచేందుకు గోడౌన్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ నేతల ఇళ్లలో దొరికిన డబ్బు కట్లను లెక్కబెట్టలేక మెషీన్లు కూడా అలసిపోతున్నాయి. ఇలా జరగడం మొదటిసారి కాదు. 

ఎందుకు కేవలం కాంగ్రెస్ నేతల ఇళ్లలోనే ఇలా డబ్బులు పట్టుబడుతున్నాయి? వీటిని దేనికి ఉపయోగించడానికి దాచిపెడుతున్నారో? మేం ఈ డబ్బును పట్టుకుంటే నాకు శాపనార్థాలు పెడుతుంటారు… మోదీ ఇలాంటి తిట్లకు భయపడే వ్యక్తి కాదు. ఇలాంటివాటిని అరికట్టేందుకు కొత్త చట్టం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నాం. 

ఏపీలో వైసీపీ ప్రతికూలతను దూరం చేయాల్సిన అవసరం ఉంది. అందుకు ఇతర పార్టీలు బీజేపీ, ఎన్డీయే కూటమితో జతకట్టి రావాల్సిన అవసరం ఉంది. వైసీపీ ప్రభుత్వం మద్యపాన నిషేధం అమలుచేస్తామని అధికారంలోకి వచ్చింది. కానీ ఇవాళ ప్రభుత్వమే మద్యం అమ్మకాలు జరుపుతోంది, అవినీతికి పాల్పడుతోంది. ఇక్కడ  మద్యానికి సంబంధించి ఒక పెద్ద సిండికేట్ నడుస్తోంది. ఏపీలో మద్యం మాఫియా, ఇసుక మాఫియాలు నడుస్తున్నాయి. 

వైసీపీ ప్రభుత్వంలో అవినీతి ఫుల్ స్పీడ్ లో ఉండగా, అభివృద్ధికి బ్రేక్ పడింది. ప్రజలారా… మీకు గుర్తుండే ఉంటుంది… వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు నిర్మిస్తామని చెప్పింది. మరి ఇన్నేళ్లలో ఒక్క రాజధాని అయినా కట్టారా? మూడు రాజధానుల పేరిట చాలా భారీ ఎత్తున లూటీ చేసే ప్రయత్నంలో ఉండగా, ఈ ప్రభుత్వ ఖజానా పూర్తిగా ఖాళీ అయింది. 

వీళ్లు అవినీతిని మాత్రమే చేయగలరు, ఆర్థిక వ్యవహారాల నిర్వహణ అనేది ఈ వైసీపీ ప్రభుత్వానికి తెలియనే తెలియదు. ప్రజలకు సేవ చేయాలన్న కోరిక లేని ప్రభుత్వం ఉంటే ఇలాంటి దుష్ఫలితాలే వస్తాయి. 

పోలవరం ప్రాజెక్టును పూర్తిగా నిలిపివేసి ఆంధ్రప్రదేశ్ జీవనాడికి బ్రేక్ వేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం రూ.15 వేల కోట్లు ఇచ్చింది. కానీ వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లలేదు. నేడు ఏపీ రైతులు సాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు. రైతులకు మద్దతు ధర లభించడంలేదు. జూన్ 4 తర్వాత ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక, ఇటువంటి సమస్యలన్నీ దూరం చేస్తుంది. 

వికసిత ఆంధ్రప్రదేశ్ అనేది వికసిత భారత్ అనే స్వప్నంలో భాగం. గత పదేళ్లలో ఏపీలో అభివృద్ధిని వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకున్నాం. ఎన్టీఆర్… రాముడు, తదితర అనేక పౌరాణిక పాత్రలతో ప్రజల హృదయాలను ఆకట్టుకున్నారు” అంటూ మోదీ వివరించారు.

Related posts

అమిత్ షాకు చేతకాకుంటే 1.25 కోట్ల సోదరీమణులకు అప్పగించాలి: కేజ్రీవాల్

Ram Narayana

హర్యానాలో కాంగ్రెస్ తప్పిదాలే బీజేపీ గెలుపుకు కారణం … ఒవైసీ

Ram Narayana

వారసుడు అంశంపై మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు…

Ram Narayana

Leave a Comment