- పెల్లెట్స్ తో కాల్పులకు దిగిన ఓ వ్యక్తి
- ముగ్గురు మైనర్లు సహా ఐదుగురికి గాయాలు
- రాణితల ప్రాంతంలో ఘటన..
- గాయపడ్డ వారు స్థానిక ఆసుపత్రికి తరలింపు
- శాంతి భద్రతలు అదుపు చేసేందుకు రంగంలోకి దిగిన పోలీసులు
పశ్చిమబెంగాల్లో ఎన్నికల అనంతరం హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ముర్షీదాబాద్ జిల్లాలో జరిగిన ఘర్షణల్లో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. రాణితల ప్రాంతంలో ఓ వ్యక్తి పెల్లెట్స్ తో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు మైనర్లు సహా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ ఐదుగురిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాల్పులు జరిపిన వ్యక్తి తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తిగా బీజేపీ ఆరోపిస్తోంది. అయితే అతడితో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని టీఎంసీ ప్రకటించింది. ఆ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను అదుపుచేసేందుకు, ఘర్షణలు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు బుధవారం అధికారులు వెల్లడించారు.
జాంగీపూర్, ముర్షీబాద్ లలో మంగళవారం జరిగిన మూడో దశ ఎన్నికల పోలింగ్ సందర్భంగా తలెత్తిన ఉద్రిక్తతలే ఈ ఘటనకు కారణమని అధికారులు భావిస్తున్నారు. కాగా, ఘటనపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సమిక్ భట్టాచార్య మాట్లాడుతూ… పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వల్ల ఈ తరహా నేర సంస్కృతి సాధారణమైపోయిందన్నారు. అధికార పార్టీ టీఎంసీ హింసను ప్రోత్సహిస్తుండటం అందరికీ తెలిసిందేనని భట్టాచార్య చెప్పారు. మైనర్లని కూడా చూడకుండా అధికారపార్టీ హింసాత్మక దాడులకు పాల్పడటం దారుణమన్నారు. హుగ్లీ జిల్లాలోని పండా ప్రాంతంలో జరిగిన పేలుడు ఘటనలో ఒకరు మృతి చెందిగా మరో ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన 48 గంటల్లోనే ముర్షీదాబాద్ జిల్లాలో కాల్పుల ఘటన జరగడం పశ్చిమబెంగాల్ లో శాంతిభద్రతల పరిస్థితికి అద్దం పడుతుందని భట్టాచార్య చెప్పారు.