పోటెత్తిన ఓటర్లు … 6.30 గంటలకే భారీ క్యూలైన్లు..
అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండటంతో ఏపీలో పండుగ వాతావరణం
ఏపీ, తెలంగాణలో మొదలైన ఓట్ల పండుగ
ఓటింగ్ కేంద్రాలకు తరలివస్తున్న ఓటర్లు
పకడ్బందీ ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘం

ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024 పోలింగ్ ప్రక్రియ మొదలైంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 25 ఎంపీ స్థానాల్లో ఓటింగ్ షరూ అయ్యింది. ఇటు తెలంగాణ పరిధిలోని 17 లోక్‌సభ స్థానాలకు కూడా పోలింగ్ మొదలైంది. రాష్ట్రంలోని అనేక పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం 6.30 గంటలకే భారీ క్యూ లైన్లు కనిపించాయి. వేర్వేరు పనులు, తీవ్రమైన ఎండల నేపథ్యంలో త్వరగా ఓటు వేయాలనే ఉద్దేశంతో చాలా మంది పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. మరోవైపు పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు . కాగా పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక నియోజకవర్గాల్లో ప్రత్యేక భద్రత, నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసింది.
ఉదయం 9 గంటల సమయానికి ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ 9.21 శాతంగా నమోదయిందని ఎన్నికల సంఘం తెలిపింది. ఉదయం 9 గంటల వరకు లోక్‌సభకు ఏపీలో 9.05శాతం, తెలంగాణలో 9.51 శాతం పోలింగ్ నమోదయినట్టు పేర్కొంది. కుప్పం నియోజకవర్గంలో ఉదయం 9 గంటలకు 9.72శాతం, మంగళగిరిలో 5.25శాతం, పిఠాపురంలో 10.02శాతం, పులివెందుల 12.44శాతం పోలింగ్ నమోదయినట్టు అధికారులు వివరించారు.
ఏపీలో జిల్లాల వారీగా చూస్తే 9 గంటల సమయానికి వైఎస్‌ఆర్ జిల్లాలో 12.09శాతం గరిష్ఠంగా నమోదయింది. ఇక అత్యల్పంగా గుంటూరులో 6.17శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. తెలంగాణ జిల్లాలను పరిశీలిస్తే ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధికంగా 13.22శాతం పోలింగ్ శాతం నమోదయ్యింది. ఇక హైదరాబాద్‌లో అత్యల్పంగా 5.06 శాతం మాత్రమే నమోదయింది.
మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఏపీ, తెలంగాణలో నమోదైన పోలింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఏపీలో 36 శాతం, తెలంగాణలో 40 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ తెలిపింది. ఇక ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ శాతం గంట గంటకు పెరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒకటి వరకు 36 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. తొలి మూడు గంటలు మందకొడిగా సాగిన పోలింగ్ ఉదయం 11 గంటల తర్వాత పుంజుకుంది.
ఏపీలో ఉదయం 11 గంటలకు 23.10 శాతం పోలింగ్ నమోదు కాగా, ఆ తర్వాత మరో రెండు గంటల్లోనే 36 శాతానికి చేరింది. చాలా చోట్ల భారీ సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. నరసరావుపేటలో 27.14, గురజాలలో 24.31, సత్తెనపల్లిలో 23.63, వినుకొండలో 24.83 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, 2019 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 79.84 శాతం పోలింగ్ నమోదైన విషయం తెలిసిందే. ఈసారి 83 శాతం పోలింగ్ జరిగే అవకాశముందని ఈసీ అంచనా వేసింది. ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్ మీనా కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు.
తెలంగాణలో 3 గంటల వరకు 52.34 శాతం పోలింగ్ నమోదయింది. అత్యధికంగా ఖమ్మంలో 63.67 శాతం, కరీంనగర్‌లో 58.24 శాతం, మహబూబాబాద్‌లో 61.4 శాతం, పెద్దపల్లిలో 55.92 శాతం, నల్గొండలో 59.91 శాతం, హైదరాబాద్‌లో 29.47 శాతం పోలింగ్ నమోదయింది. రాష్ట్రంలోని 17 లోక్ సభ నియోజకవర్గాలకు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. 5 గంటల లోపు పోలింగ్ కేంద్రానికి వచ్చిన వారికి ఓటు వేసేందుకు అవకాశం ఇస్తారు. గుర్తించిన సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగుస్తుంది.
ఏపీలో జిల్లాల వారీగా పోలింగ్ శాతం… (సాయంత్రం 5 గంటల సమయానికి)
- శ్రీకాకుళం- 67.48
- విజయనగరం- 68.16
- పార్వతీపురం మన్యం- 61.18
- విశాఖ- 57.42
- అల్లూరి సీతారామరాజు- 55.17
- అనకాపల్లి- 65.97
- కాకినాడ- 65.01
- కోనసీమ- 73.55
- తూర్పు గోదావరి- 67.93
- పశ్చిమ గోదావరి- 68.98
- ఏలూరు- 71.10
- కృష్ణా- 73.53
- ఎన్టీఆర్- 67.44
- గుంటూరు- 65.58
- పల్నాడు- 69.10
- బాపట్ల- 72.14
- ప్రకాశం- 71.00
- నెల్లూరు- 69.95
- తిరుపతి- 65.88
- చిత్తూరు- 74.06
- అన్నమయ్య- 67.63
- వైఎస్సార్ కడప- 72.85
- నంద్యాల- 71.43
- కర్నూలు- 64.55
- అనంతపురం-68.04
- శ్రీ సత్యసాయి- 67.16
లోక్ సభ స్థానాల వారీగా పోలింగ్ శాతం వివరాలు… (సాయంత్రం 5 గంటల సమయానికి)
- కాకినాడ- 65.01
- అమలాపురం- 73.55
- రాజమండ్రి- 67.93
- నరసాపురం- 68.98
- ఏలూరు- 71.10
- శ్రీకాకుళం- 67.10
- విజయనగరం- 67.74
- అరకు- 58.20
- విశాఖ- 59.39
- అనకాపల్లి- 64.14
- మచిలీపట్నం- 73.53
- విజయవాడ- 67.44
- గుంటూరు- 65.58
- నరసరావుపేట- 69.10
- బాపట్ల- 72.57
- ఒంగోలు- 70.44
- నెల్లూరు- 69.55
- తిరుపతి- 65.91
- చిత్తూరు- 75.60
- రాజంపేట- 68.47
- కడప- 72.85
- కర్నూలు- 64.08
- నంద్యాల- 70.58
- హిందూపురం- 66.89
- అనంతపురం- 67.71
ఏపీ అసెంబ్లీ బరిలో 2,387 మంది అభ్యర్థులు
ఏపీలో ఎన్నికల సమాచారం విషయానికి వస్తే అసెంబ్లీ బరిలో 2387 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పార్లమెంట్ బరిలో 454 మంది అభ్యర్థులు ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 4,14,01,887 కోట్లుగా ఉంది. అందులో పురుషులు – 2,03,39,851, మహిళలు – 2,10,58,615, థర్డ్ జెండర్ – 3,421గా ఉన్నారు. ఇక మొత్తం పోలింగ్ కేంద్రాలు – 46,389 కాగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు – 12,438గా ఉన్నాయి. మొత్తం 34,651 (74.7 శాతం) పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు.
మరోవైపు దేశవ్యాప్తంగా 4వ దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ చిన్న చిన్న సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది …. తెలంగాణ, ఏపీ సహా దేశవ్యాప్తంగా మొత్తం 96 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటింగ్ సరళిని ఎన్నికల కమిషన్ నిశితంగా పరిశీలించింది …