- దేశంలో ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు
- జూన్ 1న చివరి దశ పోలింగ్
- జూన్ 4న ఓట్ల లెక్కింపు
దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జూన్ 1తో ముగియనుంది. దేశంలో ఈసారి ఏడు దశల్లో పోలింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఆరు దశల పోలింగ్ పూర్తయింది. మరొక్క విడత మిగిలుంది. జూన్ 4న దేశ వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
ఈ నేపథ్యంలో, ఢిల్లీ నుంచి ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సమీక్ష చేపట్టారు. లోక్ సభ ఎన్నికలు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై చర్చించారు. ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా కౌంటింగ్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా ఈ సమీక్షకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.
ఇక, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మాదిరే ఏపీలోనూ కౌంటింగ్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. భద్రత కోసం ఇప్పటికే 25 కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రానికి చేరుకున్నాయి. 24 జిల్లాలకు 56 మంది ఏఎస్పీలు, డీఎస్పీలను నియమించారు. నాన్ క్యాడర్ ఎస్పీలకు బందోబస్తు బాధ్యతలు అప్పగించారు.
ఓట్ల లెక్కింపు నేపథ్యంలో మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాలను అత్యంత భద్రత ఉండే రెడ్ జోన్లుగా పరిగణిస్తారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో 25 వేల మందికి పైగా ఉద్యోగులు పాల్గొననున్నారు.
జూన్ 4వ తేదీన ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు చేపడతారు. సువిధ యాప్ లో నమోదు చేసిన తర్వాతే ఫలితాలను వెల్లడించనున్నారు. కౌంటింగ్ రోజున 200 మంది కేంద్ర పరిశీలకులు, 200 మంది రిటర్నింగ్ అధికారులు విధుల్లో ఉంటారు.