పోస్టల్ బ్యాలెట్లపై ఈసీ ఆ నిబంధనలు ఉపసంహరించుకోవాలి: పేర్ని నాని
- పోస్టల్ బ్యాలెట్లపై స్టాంపు లేకపోయినా ఆమోదించాలన్న ఈసీ
- నిన్న ఏపీ సీఈవో ద్వారా మార్గదర్శకాల జారీ
- గతంలో సంతకం, స్టాంపు రెండూ ఉండాలని ఈసీనే చెప్పిందన్న పేర్ని నాని
- తాజా ఆదేశాలతో గందరగోళం చెలరేగే అవకాశం ఉందని వెల్లడి
- ఇవాళ పేర్ని నాని నేతృత్వంలో అదనపు సీఈవోను కలిసిన వైసీపీ నేతలు
రిటర్నింగ్ అధికారి సంతకం ఉంటే చాలని, సీల్ (స్టాంపు) లేకపోయినా ఆ పోస్టల్ బ్యాలెట్లను ఆమోదించాలని ఏపీ సీఈవోకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి మార్గదర్శకాలు అందిన సంగతి తెలిసిందే. ఈసీ మార్గదర్శకాలను ఏపీ సీఈవో ముఖేశ్ కుమార్ మీనా జిల్లాల ఆర్వోలకు పంపించారు.
అయితే, దీనిపై అధికార వైసీపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. స్టాంపు లేకపోయినా ఆమోదించాలని ఇప్పుడు చెబుతున్నారని, దేశంలో ఎక్కడైనా ఇలా ఉందా? అని వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. ఇవాళ పేర్ని నాని నేతృత్వంలో వైసీపీ నేతలు నేడు అదనపు సీఈవోను కలిసి పోస్టల్ బ్యాలెట్ల అంశంపై తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు.
గతంలో గెజిటెడ్ అధికారి సంతకం, స్టాంపు రెండూ ఉండాలని చెప్పారు… ఇప్పుడు సంతకం చాలు, స్టాంపు లేకపోయినా ఆమోదిస్తాం అంటున్నారు… ఈసీ ఇచ్చిన ఆదేశాలతో గందరగోళం చెలరేగే అవకాశముందని పేర్ని నాని పేర్కొన్నారు.
ఆయా పోస్టల్ బ్యాలెట్లపై ఏజెంట్లు అభ్యంతరం చెబితే కౌంటింగ్ హాళ్లలో ఘర్షణలు జరిగే అవకాశం ఉందని అన్నారు. ఓటు గోప్యతకు భంగం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఈ మార్గదర్శకాలను ఈసీ వెనక్కి తీసుకోవాలని కోరుతున్నామని పేర్ని నాని తెలిపారు.