- జులై 12న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి
- 13న ఆశీర్వాద కార్యక్రమం.. 14న రిసెప్షన్
- ఇక పెళ్లికి వెళ్లేవారికి సంప్రదాయ దుస్తులు తప్పనిసరి
బిలియనీర్ ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి శుభలేఖ వచ్చేసింది. వీరి వివాహం జులై 12వ తారీఖున ముంబైలోని జియో కన్వెన్షన్ వరల్డ్ సెంటర్‌లో జరగనుంది. సంప్రదాయ హిందూ పద్ధతిలోనే వివాహం జరగనుంది. మూడు రోజుల పాటు సాగే వేడుకలతో కూడిన శుభలేఖ తాజాగా బయటకు వచ్చింది.
శుభలేఖలో పేర్కొన్న విధంగా జులై 12న వివాహం, 13న ఆశీర్వాద కార్యక్రమం, 14న రిసెప్షన్ ఉంటుంది. ఇక పెళ్లికి వచ్చేవారు తప్పనిసరిగా ట్రెడిషనల్ డ్రెస్‌లోనే రావాలని కోరడం జరిగింది. కాగా, అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ గుజరాత్‌లోని జామ్ నగర్‌లో గ్రాండ్‌గా జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి దేశ, విదేశాల నుంచి అతిథులు గుజరాత్ బాటపట్టారు.
ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, మోర్గాన్ స్టాన్లీ సీఈవో టెడ్ పిక్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, డిస్నీ సీఈవో బాబ్ ఇగర్, బ్లాక్‌రాక్ సీఈవో లారీ ఫింక్, అడ్నాక్ సీఈవో సుల్తాన్ అహ్మద్ అల్ జాబర్, పాప్ సింగర్ రిహన్నా ఉన్నారు. మార్చి 1 నుంచి 3వ తేదీ వరకు జరిగిన ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకలను ముకేశ్ ఫ్యామిలీ మెంబర్స్ ఘనంగా సెలబ్రేట్ చేశారు. ఇక ఈ వేడుకల కోసం ముకేశ్ అంబానీ భారీగానే ఖర్చు పెట్టినట్లు అప్పుడు కథనాలు కూడా వెలువడ్డాయి.