Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

ప్రధాని మోదీపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్ర విమర్శలు…

  • నిర్దిష్ట వర్గాన్ని, ప్రతిపక్షాన్ని లక్ష్యంగా చేసుకొని మోదీ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం
  • ప్రధాని కార్యాలయం హుందాతనాన్ని మోదీ తగ్గించారని విమర్శ
  • ఎల్లుండి పంజాబ్‌లో ఎన్నికల నేపథ్యంలో బహిరంగ లేఖ

ప్రధాని నరేంద్ర మోదీపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సమాజంలో నిర్దిష్ట వర్గాన్ని లేదా ప్రతిపక్షాన్ని లక్ష్యంగా చేసుకొని మోదీ ద్వేషపూరిత, అన్‌పార్లమెంటరీ పదాలను ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. తద్వారా ఆయన ప్రధాని కార్యాలయం హుందాతనాన్ని తగ్గించారన్నారు. ఎల్లుండి (జూన్ 1) లోక్ సభ తుది దశ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పంజాబ్ ఓటర్లకు ఆయన బహిరంగ లేఖ రాశారు.

ప్రజాస్వామ్యం, మన రాజ్యాంగాన్ని నిరంకుశ పాలన నుంచి రక్షించేందుకు ఇది ఒక అవకాశంగా భావించాలని ఆ లేఖలో మాజీ ప్రధాని పేర్కొన్నారు. మోదీ విభజనవాదాన్ని ప్రోత్సహించే ప్రసంగాలు చేశారన్నారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని చెప్పి… ఆ హామీని తుంగలో తొక్కారని విమర్శించారు. గత పదేళ్లలో మోదీ విధానాల వల్ల రైతుల ఆదాయానికి గండిపడిందని ఆరోపించారు.

ప్రస్తుతం జరుగుతోన్న లోక్ సభ ఎన్నికల్లోని రాజకీయ పరిణామాలను తాను గమనిస్తున్నానని… మోదీ అత్యంత దుర్మార్గమైన ద్వేషపూరిత ప్రసంగాలు చేశారని విమర్శించారు. అవి పూర్తిగా విభజన స్వభావాన్ని కలిగి ఉన్నాయన్నారు. ప్రధాని కార్యాలయ హుందాతనాన్ని తగ్గించిన మొదటి ప్రధాని… మోదీయే అని విమర్శించారు.

ఏ ప్రధాని కూడా ఇలాంటి ప్రకటనలు చేయలేదన్నారు. తన జీవితంలో ఎన్నడూ ఓ వర్గాన్ని వేరుగా చూడలేదన్నారు. అది బీజేపీకే చెల్లిందని విమర్శించారు. దేశంలో రైతుల సరాసరి ఆదాయం రోజుకు రూ.27 మాత్రమేనని… అదే ఒక్కో రైతుపై ఉన్న అప్పు మాత్రం రూ.27,000 అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంధనం, ఎరువుల ధరలు భారీగా పెరిగాయన్నారు. వ్యవసాయ ఆధారిత పనిముట్లపై జీఎస్టీ విధించడం, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతులపై విచిత్ర నిర్ణయాలు తీసుకోవడం వంటివి రైతు కుటుంబాల ఆదాయాన్ని తీవ్రంగా దెబ్బతీశాయన్నారు.

ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేపట్టినప్పుడు 750 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. లాఠీలు, రబ్బర్ బుల్లెట్లు చాలవన్నట్లుగా ఏకంగా ప్రధాని మోదీ వారిపై మాటల దాడికి కూడా దిగారని మండిపడ్డారు. గడిచిన పదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకులకు లోనైందన్నారు. పెద్ద నోట్ల రద్దు, లోపభూయిష్ట జీఎస్టీ విధానం, కరోనా సమయంలో నిర్వహణ లోపం వంటివి దయనీయ పరిస్థితికి దారితీశాయన్నారు.

Related posts

కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ వేగంగా పుంజుకుంది: కర్ణాటక మంత్రి దినేశ్ గూండురావు

Ram Narayana

బీఆర్ యస్ అవినీతి పార్టీ …దాని అడుగుజాడల్లోనే కాంగ్రెస్ పార్టీ …జెపి నడ్డా ధ్వజం…

Ram Narayana

 విపక్ష కూటమికి BHARAT పేరు పెట్టాలన్న శశి థరూర్.. దీని అర్థం కూడా చెప్పిన వైనం

Ram Narayana

Leave a Comment