- అరుణాచల్ ప్రదేశ్ ఆరంభ ట్రెండ్స్‌లో ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థులు
- 10 మంది అభ్యర్థులు ఏకగ్రీవం అవడంతో 50 స్థానాలకు జరుగుతున్న కౌంటింగ్
- సిక్కింలో అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా, విపక్ష సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీల మధ్య ప్రధాన పోటీ
లోక్‌సభ ఎన్నికలతో పాటుగా నిర్వహించిన సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈసీ షెడ్యూల్ ప్రకారం ఆదివారం ఉదయమే కౌంటింగ్ మొదలైంది. కౌంటింగ్ మొదలైన గంట తర్వాత అరుణాచల్‌లో బీజేపీ, దాని మిత్రపక్షం కాన్రాడ్ సంగ్మా నేషనల్ పీపుల్స్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఇక సిక్కింలో అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా ఆధిక్యంలో కనిపిస్తోంది. కౌంటింగ్‌కు సంబంధించి ఉదయం 7.30 గంటల సమయంలో సిక్కింలో అధికార ఎస్‌కేఎం పార్టీ 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక బీజేపీ ఒక చోట, ప్రతిపక్ష సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ పార్టీ అభ్యర్థులు పలు చోట్ల లీడ్‌లో కొనసాగుతున్నారు.
అరుణాచల్ ప్రదేశ్‌లో 10 మంది బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవం కావడంతో రాష్ట్రంలోని 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా నేడు (ఆదివారం) 50 స్థానాల ఫలితాలు వెలువడనున్నాయి. ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో ముఖ్యమంత్రి పెమా ఖండూ కూడా ఉన్నారు. మిగతావారిలో డిప్యూటీ ముఖ్యమంత్రి చౌనా మెయిన్, ఇటానగర్ నుండి టెకీ కాసో, తాలిహా నుండి న్యాతో దుకమ్, రోయింగ్ నుంచి ముచ్చు మితితో పాటు పలువురు ఉన్నారు. 2019లో 41 సీట్లు గెలుచుకున్న బీజేపీ మొత్తం 60 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. కాంగ్రెస్ 34 స్థానాల్లో తమ అభ్యర్థులను ఇక్కడ బరిలో నిలిపింది.
ఇక సిక్కిం విషయానికి వస్తే అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్‌కేఎం), విపక్ష సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. రెండు పార్టీలు మొత్తం 32 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాయి. ఇక బీజేపీ అక్కడ 31 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. కొన్ని పార్టీలతో పొత్తులో భాగంగా కాంగ్రెస్ 12 స్థానాల్లో పోటీ చేసింది.