Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఎగ్జిట్ పోల్స్ ...రిజల్ట్స్ ...

 లోక్‌సభ ఎన్నికల్లో అత్యల్ప మెజారిటీ 48 ఓట్లు.. శివసేన అభ్యర్థిని వరించిన అదృష్టం

  • ముంబై వాయవ్యం సీటు నుంచి అత్యల్ప మెజారిటీతో గెలిచిన శివసేన షిండేవర్గం నేత రవీంద్ర వైకర్
  • ఉద్ధవ్ వర్గం శివసేన అభ్యర్థిపై అదృష్టం కొద్దీ గెలుపు
  • 1989, 1998 లోక్‌సభ ఎన్నికల్లో అత్యల్ప మెజారిటీగా ఉన్న 9 ఓట్ల వ్యత్యాసం

లోక్‌సభ ఎన్నికలలో శివసేన (షిండే వర్గం) నేత రవీంద్ర వైకర్ ముంబై వాయవ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి కేవలం 48 ఓట్ల తేడాతో ఎంపీగా గెలుపొందారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో అత్యల్ప మెజారిటీతో గెలిచిన వ్యక్తిగా రవీంద్ర వైకర్ నిలిచారు. శివసేన యూబీటీ (ఉద్ధవ్ వర్గం) అభ్యర్థి అమోల్ గజానన్ కీర్తికర్‌పై ఈ చారిత్రాత్మక విజయం సాధించారు. కాగా లోక్‌సభ ఎన్నికల్లో అత్యల్ప మెజారిటీ విజయం రికార్డు ఏపీకి చెందిన కొణతాల రామకృష్ణ, బీహార్‌కు చెందిన సోమ్ మరాండీ పేర్ల మీద ఉంది. 1989లో అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ, 1998లో బీహార్‌లోని రాజ్‌మహల్ లోక్‌సభ స్థానం నుంచి సోమ్ మరాండీ ఇద్దరూ కేవలం 9 ఓట్ల తేడాతో విజయాలు సాధించారు.

కాగా ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అదూర్ ప్రకాష్ రెండో అత్యల్ప మెజారిటీ విజయాన్ని నమోదు చేశారు. కేరళలోని అట్టింగల్ నియోజకవర్గం నుంచి తన ప్రత్యర్థిపై కేవలం 684 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక జైపూర్ రూరల్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి రావు రాజేంద్ర సింగ్ 1,615 ఓట్లు, ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ నుంచి బీజేపీకే చెందిన బ్రోజ్‌రాజ్ నాగ్ 1,884 ఓట్లతో 2,000 లోపు ఓట్ల తేడాతో గెలిచిన ఎంపీల జాబితాలో ఉన్నారు.

ఇక 5 వేల లోపు ఓట్ల తేడాతో గెలిచిన ఎంపీల జాబితాలో.. ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌ నుంచి బీజేపీ అభ్యర్థి ముఖేశ్ రాజ్‌పుత్‌ (2,678 ఓట్లు), ఫుల్‌పూర్‌ నుంచి బీజేపీ అభ్యర్థి ప్రవీణ్‌ పటేల్‌ (4,332 ఓట్లు), పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి షేర్‌ సింగ్‌ ఘుబాయా (3,242 ఓట్లు) మెజార్టీలతో గట్టెక్కారు. ఇక చండీగఢ్‌ నుంచి సీనియర్‌ కాంగ్రెస్‌ నేత మనీష్‌ తివారీ (2,504 ఓట్లు), లక్షద్వీప్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి ముహమ్మద్‌ హమ్‌దుల్లా సయీద్‌ (2,647 ఓట్లు), ఉత్తరప్రదేశ్‌లోని ధౌరాహ్రా నుంచి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి ఆనంద్‌ భదౌరియా (4,449 ఓట్లు) ఉన్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని బన్స్‌గావ్‌ నుంచి బీజేపీ అభ్యర్థి కమలేష్‌ పాశ్వాన్‌ 3,150 ఓట్లు, బిష్ణుపూర్‌ నుంచి సౌమిత్రా ఖాన్‌ 5,567 ఓట్లు, మహబూబ్‌నగర్‌ నుంచి బీజేపీ అభ్యర్థి డీకే అరుణ 4,500 ఓట్లు, ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌ నుంచి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి అజేంద్ర సింగ్‌ లోథీ 2,629 ఓట్లు, సేలంపూర్‌ నుంచి ఎస్పీ అభ్యర్థి రామశంకర్‌ రాజ్‌భర్‌ 3,573 ఓట్ల స్వల్ప మెజారిటీలతో గెలిచారు.

Related posts

ఎగ్జిట్ పోల్స్ తారుమారవుతాయి: డీకే శివకుమార్

Ram Narayana

ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ విడుదల… ఏ పార్టీకి ఎన్ని సీట్లు…!

Ram Narayana

అరుణాచల్ లో కమల వికాసం…సిక్కిం లో క్రాంతికారి మోర్చా జయకేతనం …

Ram Narayana

Leave a Comment