- ఏపీకి హోదా ఇస్తామని ప్రధాని మోదీ 2014లో తిరుపతి వేదికగా హామీ ఇచ్చారన్న జైరాం రమేశ్
- వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేస్తారా? అని ప్రశ్న
- దేశవ్యాప్తంగా కులగణన చేపడతారా చెప్పాలని నిలదీత
ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక హోదా ఇస్తారా? అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఏపీతో పాటు బీహార్ రాష్ట్రానికి హోదా ఇస్తామని గతంలో ఇచ్చిన హామీని మోదీ నెరవేరుస్తారా? అని నిలదీశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా నాలుగు ప్రశ్నలు సంధిస్తూ పోస్ట్ చేశారు.
ఏపీకి హోదా ఇస్తామని ఏప్రిల్ 30, 2014న తిరుపతి వేదికగా మోదీ హామీ ఇచ్చారు… దీంతో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని చెప్పారని గుర్తు చేశారు. ఇప్పటికి పదేళ్లయినా హోదా ఇవ్వలేదని… ఇప్పుడు ఏం చేస్తారో చెప్పాలన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అన్ని పార్టీలు వ్యతిరేకించాయని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ ప్రైవేటీకరణను ఆపేస్తారా? అని ప్రశ్నించారు.
ఎన్డీయే కూటమిలో ఉన్న నితీశ్ కుమార్ ఎంతో కాలంగా బీహార్‌కు ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తున్నారని… ఇప్పుడు ప్రధాని మౌనం వీడాలన్నారు. కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయూలతో కొనసాగిన మహాఘట్‌బంధన్ హయాంలో రాష్ట్రంలో కులగణన చేపట్టామని… దీనిని దేశవ్యాప్తంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. నితీశ్ కూడా ఇందుకు మద్దతు తెలుపుతున్నారని… మరి ప్రధాని కులగణన చేస్తారా? అని ప్రశ్నించారు.