Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

సామాన్యుడి నుంచి అసామాన్యుడిగా రామాజీరావు ప్రస్థానం …

  • రామోజీ అసలు పేరు చెరుకూరు రామయ్య
  • 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని పెదపారుపూడిలో జననం
  • 1962లో మార్గదర్శి చిట్‌ఫండ్ స్థాపన
  • 1969లో ‘అన్నదాత’ మాసపత్రికను స్థాపించిన రామోజీరావు
  • ఈనాడు, రామోజీ గ్రూపుల ద్వారా ఎన్నో వ్యాపారాలు
  • తెలుగు రాజకీయాలపైనా తన ప్రభావం
  • తెలుగు భాష అభ్యున్నతికి ఎనలేని సేవలు అందించిన ‘తెలుగు మీడియా మొఘల్’
  • శనివారం ఉదయం తుదిశ్వాస విడిచిన రామోజీరావు

ఆయన.. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి.. అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ చెరగని ముద్ర వేశారు. రైతు బిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా ఎదిగారు. మీడియా సంస్థల సారధిగా ప్రజాహితాన్ని కాంక్షించారు. సామాన్యుడే అయినా అసమాన్య రీతిలో శిఖరంగా ఎదిగారు. ‘అన్నదాత’ మాసపత్రికను తీసుకొచ్చి రైతులకు ప్రియనేస్తంగా మారారు. మీడియా సంస్థలను పరిచయం చేసి తెలుగు వారి విశ్వాసాన్ని గెలుచుకున్నారు. చిట్‌ఫండ్ వ్యాపారంలో అడుగుపెట్టి నమ్మకానికి చిరునామా అయ్యారు. రామోజీ ఫిల్మ్‌సిటీని స్థాపించి ప్రపంచ చిత్రపటంలో తెలుగు నేలకు చోటు కల్పించారు.

 ఇక మాతృభాష ‘తెలుగు’ అభ్యున్నతికి ఆయన చిరస్థాయిగా నిలిచిపోయే సేవలు అందించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా.. ఎన్నో విజయగాథలు, స్ఫూర్తిదాయక కథనాలు.. ఇవన్నీ దివికేగిన రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు జీవితంలో విజయ ప్రస్థానాలు. అనారోగ్యంతో శనివారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచిన నేపథ్యంలో రామోజీరావు జీవిత ప్రస్థానానికి సంబంధించిన విశేషాలు ‘ఏపీ7ఏఎం’ పాఠకుల కోసం ప్రత్యేకం..
 తన పేరుని తానే పెట్టుకున్నారు…
రామోజీరావు కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని పెదపారుపూడిలో 1936, నవంబర్ 16న సాధారణ మధ్య తరగతి రైతు కుటుంబంలో ఆయన జన్మించారు. తాతయ్య పేరునే ‘రామయ్య’గా ఆయనకు పెట్టారు. అయితే బడికి వెళ్లిన రామోజీరావు తన పేరు రామోజీరావు అని మాస్టారుకు చెప్పారు. అలా రామయ్య కాస్తా రామోజీరావు అయ్యారు. మాస్టారుకి పేరు మార్చి చెప్పడంతో ఇంట్లో వాళ్లంతా ఆశ్చర్యపోయారు. ప్రతిభను చూసి మురిసిపోయారు. 1951లో ఆయన హైస్కూల్ విద్యాభ్యాసం ముగిసింది. గుడివాడ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదివారు. అనంతరం అక్కడే బీఎస్సీ పూర్తి చేశారు. చదువుకునే రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యుడిగా ఉన్నారు. మహాత్మాగాంధీ అంటే రామోజీరావుకు ఎంతో ఇష్టం. 

1961 ఆగస్టు 19న పెనమలూరుకు చెందిన తాతినేని రమాదేవిని ఆయన వివాహమాడారు. పెళ్లి తర్వాత భార్యతో కలిసి దేశరాజధాని ఢిల్లీకి మకాం మార్చారు. ఢిల్లీలో ఆర్టిస్టుగా తనను తాను తీర్చిదిద్దుకున్నారు. 1962లో పెద్ద కుమారుడు కిరణ్ పుట్టిన తర్వాత ఢిల్లీలో ఉద్యోగాన్ని మానేసి వ్యాపారరంగంలోకి అడుగుపెట్టేందుకు మార్గం సిద్ధం చేసుకున్నారు.

చిట్ ఫండ్ నేస్తం..
రైతు నేపథ్యం ఉన్న రామోజీరావు 1962లో హైదరాబాద్ కేంద్రంగా మార్గదర్శి చిట్ ఫండ్‌ను నెలకొల్పారు. హిమాయత్ నగర్‌లో కేవలం ఇద్దరు ఉద్యోగులతో సంస్థను ప్రారంభించారు. మార్గదర్శి ప్రచారం కోసం కిరణ్ యాడ్స్ పేరిట యాడ్ ఏజెన్సీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. ఈ ఏజెన్సీ, హైదరాబాద్‌లో ప్రభుత్వ గుర్తింపు పొందిన తొలి యాడ్ ఏజెన్సీగా నిలిచింది. కొద్ది కాలానికే మార్గదర్శి రెండో శాఖను విశాఖపట్టణంలో నెలకొల్పారు. ప్రస్తుతం ఈ సంస్థ నాలుగు రాష్ట్రాల్లో 113 శాఖలు, 3 లక్షలకుపైగా ఖాతాదారులు, 4100 మందికిపైగా ఉద్యోగులు, 18 వేలకుపైగా ఏజెంట్లతో చక్కటి వృద్ధిలో ముందుకు సాగుతోంది. 
 
1969లో ‘అన్నదాత మాసపత్రిక’ ప్రారంభం
రైతు కుటుంబానికి చెందిన రామోజీరావు… రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, మెలకువలు నేర్పేందుకు 1969లో ‘అన్నదాత’ మాసపత్రికను స్థాపించారు. ఈ పత్రిక అనతికాలంలోనే తెలుగు రైతుల మనసులను దోచుకుంది. ఆధునిక సేద్యంలో రైతుల ప్రియనేస్తంగా మారిపోయింది. ఈ పత్రిక చందాదారులకు ప్రతి ఏడాది ఒక ఉచిత డైరీని కానుకగా అందిస్తుంటారు. ఇక ఆ తర్వాతి కాలంలో విశాఖపట్నంలో డాల్ఫిన్ పేరిట హోటల్‌ను కూడా నిర్మించారు. వ్యాపార పనుల నిమిత్తం నిత్యం హైదరాబాద్, విశాఖ, ఢిల్లీల మధ్య తిరుగుతూ క్షణం తీరిక లేకుండా కార్యకలాపాలను చక్కబెట్టుకుంటున్న సమయంలో యాదృచ్ఛికంగా ఆయనకు ఈ ఆలోచన వచ్చింది.

ఈనాడు’ పత్రికకు బీజం పడింది ఇలా..
1970 దశకంలో విజయవాడ, హైదరాబాద్‌లలోనే వార్తా పత్రిక ముద్రణ జరిగేది. విజయవాడలో తయారయ్యే పత్రిక విశాఖ చేరాలంటే మధ్యాహ్నం అయ్యేది. ఇదే విషయాన్ని నాటి ఆంధ్రజ్యోతి వ్యవస్థాపకులు కేఎల్ఎన్ ప్రసాద్‌ వద్ద రామోజీరావు ప్రస్తావించారు. విశాఖలో పత్రికను ముద్రించాలని కోరారు. అయితే పత్రిక ప్రచురణ వ్యయ ప్రయాసలతో కూడినదంటూ ప్రసాద్ చెప్పిన సమాధానంతో రామోజీరావు ఏకీభవించలేకపోయారు. విశాఖలో తానే ఓ పత్రికను ప్రచురిస్తే ఎలా ఉంటుందని భావించారు. అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగారు. ఓ పాత ప్రింటింగ్ మిషన్‌ను చౌక ధరకు చేజిక్కించుకుని 1974 ఆగస్టు 10న విశాఖలో ‘ఈనాడు’కు ఊపిరి పోశారు. వార్తల ప్రచురణ నుంచి పేపర్ విక్రయం దాకా తన సొంత శైలితో ముందుకెళ్లారు.

అప్పటిదాకా ఉదయాన్నే పత్రిక ముఖం చూడని విశాఖ వాసులు ఈనాడు పత్రిక కోసం ఎగబడ్డారు. తన మార్కెటింగ్ నైపుణ్యాలతో పత్రిక సర్క్యులేషన్‌ను అనతి కాలంలోనే రామోజీరావు పెంచేశారు. ఏడాది గడిచిందో లేదో… 1975, డిసెంబర్ 17న ఈనాడు రెండో ఎడిషన్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించారు. పత్రిక సర్క్యులేషన్‌ను ఒక్కసారిగా 50 వేల మార్కును దాటించారు. మరో రెండేళ్లకు 50 వేల సర్క్యులేషన్‌తో విజయవాడ ఎడిషన్‌ను కూడా అట్టహాసంగా ప్రారంభించారు. ఇక నాలుగేళ్లలో పత్రిక మొత్తం సర్క్యులేషన్ లక్ష దాటించేశారు. ప్రస్తుతం పెద్ద సంఖ్యలో ఎడిషన్లతో ఈనాడు పత్రిక నడుస్తోంది. 

ఈనాడులో స్థానిక వార్తలకు అగ్రాసనం!
ఈనాడు పత్రిక ఆవిర్భావమే అద్భుతమనుకుంటే, తనదైన శైలిలో స్థానిక వార్తలకే అగ్రతాంబూలమిచ్చిన రామోజీ, జిల్లాల వారీగా ప్రత్యేకంగా ‘టాబ్లాయిడ్’ పేరిట అనుబంధాల ప్రచురణకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రయోగం తెలుగు జాతిని విశేషంగా ఆకట్టుకుంది. ఎంతగానంటే, ఆ తర్వాత వెలువడ్డ ఏ పత్రిక అయినా, జిల్లా వార్తల కోసం టాబ్లాయిడ్‌లను ముద్రించక తప్పనంతగా. ఇందులో రామోజీ ఏమాత్రం రాజీ పడలేదు. ఈ ప్రయోగం రామోజీ కీర్తిప్రతిష్ఠలను కూడా ఇనుమడింపజేసింది. జర్నలిజంలో ఆయనకు ప్రతిష్ఠాత్మక బీడీ గోయెంకా అవార్డును సాధించిపెట్టింది. వార్తల సేకరణకే కాక పత్రిక ప్రతులను అమ్మడానికి కూడా రామోజీ ఓ ప్రత్యేక వ్యవస్థనే నిర్మించారు. ఆ వ్యవస్థే, రామోజీ వయసురీత్యా కాస్త విశ్రమిస్తున్నప్పటికీ ప్రస్తుతం ఈనాడును దిగ్విజయంగా నడిపిస్తోంది. మెరికల్లాంటి జర్నలిస్టులను తయారుచేయడానికి ఏకంగా ‘ఈనాడు జర్నలిజం స్కూలు’ను నెలకొల్పి అత్యుత్తమ శిక్షణను ఇచ్చి, ఆ అభ్యర్థులను తన సంస్థలోనే ఉద్యోగులుగా తీసుకునే ఓ వ్యవస్థను రామోజీ తీర్చిదిద్దారు.   

సినిమాల నిర్మాణం కోసం ఉషా కిరణ్ మూవీస్ స్థాపన
రామోజీరావు సినీ ఇండస్ట్రీలోనూ విజయవంతమయ్యారు. నిర్మాణ రంగంలోకి దిగిన రామోజీ పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. రాష్ట్ర స్థాయిలోనే కాక జాతీయ స్థాయిలోనూ అవార్డులను కైవసం చేసుకున్నారు. సినిమాల నిర్మాణం కోసం ఉషా కిరణ్ మూవీస్, చిత్ర పంపిణీ కోసం మయూరి డిస్ట్రిబ్యూటర్స్‌లను ఆయన నెలకొల్పారు. సినిమా పంపిణీ రంగంలో వాస్తవ లెక్కలను చూపుతూ మయూరి సంస్థ నిర్మాతలను ఆకట్టుకుంది. ముఖ్యంగా చిన్న నిర్మాతలకు తమ సినిమాల విడుదల విషయంలో ఈ పంపిణీ సంస్థ ఎంతో ఉపయోగపడింది.  

సినిమా రంగంపై రామోజీ చెరగని ముద్ర
తన చిత్ర నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ ద్వారా తెలుగు సినిమా నిర్మాణాన్ని రామోజీరావు కొత్త పుంతలు తొక్కించారు. ‘స్టార్ డం’ ఆధారంగా చిత్ర నిర్మాణం సాగుతున్న దశలో రామోజీ ‘కథే మా హీరో’ అన్న నినాదంతో చిత్ర నిర్మాణాన్ని చేసేవారు. కొన్ని సినిమాలకు వాస్తవ సంఘటనలను కూడా ఆయన ఎంచుకున్నారు. తక్కువ బడ్జెట్‌లో సినిమాలు నిర్మించి ఎక్కువ లాభాలు ఎలా పొందవచ్చో ఆయన చేసి చూపించారు. ఆయన నిర్మించిన శ్రీవారికి ప్రేమలేఖ, ప్రేమించు పెళ్లాడు, ప్రతిఘటన, మయూరి, మౌనపోరాటం, పీపుల్స్ ఎన్‌కౌంటర్, అశ్వని… వంటి సినిమాలు కొత్త తరహాగా సాగుతూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రామోజీకి లాభాలను తెచ్చిపెట్టాయి. మంచి కథతో సరైన సినిమా తీస్తే ఎంతగా లాభాలు వస్తాయన్న విషయం ఆయనకు ‘ప్రతిఘటన’ సినిమా ద్వారా తెలిసిందని ఒక సందర్భంలో చెప్పారు. వివిధ భాషల్లో ఆయన 90కి పైగా చిత్రాలను నిర్మించారు.

టీవీ రంగంలోకి అడుగిడిన రామోజీ
టీవీ రంగంలోకి అడుగుపెట్టిన రామోజీరావు ఈటీవీని నాణ్యతకు మారుపేరుగా నిలిపారు. 1995, ఏప్రిల్‌లో ఈటీవీని ప్రారంభించారు. వినోద ప్రధానంగా ప్రారంభమైనప్పటికీ ఈటీవీ వార్తా ప్రసారాలకు కూడా పెద్ద ప్రాధాన్యత ఇచ్చారు. నానాటికి మారుతున్న సమాజ పోకడలకు అనుగుణంగా నిరంతర వార్తా ప్రసారాల కోసం ఈటీవీ-2ను కూడా ఏర్పాటు చేశారు. అనంతరం పలు భాషల్లోకి కూడా ఈ-టీవీ రంగప్రవేశం చేసింది. తెలుగు భాషలో ఏర్పాటు చేసిన వివిధ కేటగిరీల ఛానళ్లు కూడా చక్కటి ప్రజాదరణ పొందుతున్నాయి.

కళాంజలి పేరిట కళాఖండాలు.. ఆదరణ పొందిన ప్రియా పచ్చళ్లు..
ఈటీవీ ప్రారంభమైన ఏడాదే రామోజీ గ్రూప్ ‘కళాంజలి’ పేరిట కళాఖండాల విక్రయాలను ఎగుమతి చేసే విభాగాన్ని ప్రారంభించింది. దీనికి అనుగుణంగా వస్త్ర విక్రయ దుకాణాలను ప్రారంభించింది. ఇక ప్రియా ఫుడ్స్ పేరిట ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిన రామోజీ ‘ప్రియా’ బ్రాండ్ పేరిట పచ్చళ్లు, వంట నూనెల ఉత్పత్తిలోనూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. మన దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ఈ ప్రియా ఉత్పత్తులకు మంచి గిరాకీ వుంది.

‘రామోజీ ఫిల్మ్ సిటీ’కి బీజం పడిందిలా… చిత్రరంగంలో అడుగుపెట్టిన ఆయన సినిమాల నిర్మాణంలో నిర్మాతలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా గమనించారు. దీంతో సినీ నిర్మాణానికి సంబంధించిన అన్ని వసతులు ఒకే చోట ఉంటే ఎలా ఉంటుందనే ఆలోచనతో ‘రామోజీ ఫిల్మ్ సిటీ’ నిర్మాణం దిశగా అడుగులు వేశారు. దాదాపు 1,666 ఎకరాల విస్తీర్ణంలో ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా ప్రపంచంలోనే అత్యంత భారీ స్టూడియోను నిర్మించారు. 1996 అక్టోబర్‌లో రామోజీ ఫిల్మ్ సిటీని ప్రారంభించారు. ఈ నిర్మాణం ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లోనూ చోటు దక్కించుకుంది. అంతేకాదు దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఒకటిగా ఈ ‘సిటీ’ కొనసాగుతోంది.

 కింగ్ మేకర్‌గా ఉండటమే ఇష్టమట!

Related posts

నారాయణ కాలేజీలో మరో విద్యార్థి ఆత్మహత్య?

Ram Narayana

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్నికల ప్రచారం!

Ram Narayana

కేసీఆర్ కు సవాల్ విసిరిన సీపీఐ నారాయణ.. జగన్ పై తీవ్ర విమర్శలు!

Ram Narayana

Leave a Comment