తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని వెదికి మరీ దాడులు చేస్తున్నారు
- ఏపీలో ఎన్నికల ఫలితాల అనంతరం ఘటనలపై వైసీపీ ప్రెస్ మీట్
- టీడీపీ పాలన దారుణంగా ఉందన్న విజయసాయి
- యూనివర్సిటీ వీసీలపైనా దాడులు చేస్తున్నారని ఆరోపణ
- బీసీ వర్గాలకు చెందిన వీసీలను తరిమి కొడుతున్నారని వెల్లడి
ఏపీలో గత కొన్నిరోజులుగా జరుగుతున్న పరిణామాలపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందించారు. టీడీపీ పాలన దారుణంగా ఉందని, తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని వెదికి మరీ దాడులు చేస్తున్నారని ఆరోపించారు. అమానవీయమైన ఆ సంఘటలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారని వివరించారు.
యూనివర్సిటీ వీసీలపైనా దండెత్తుతున్నారని, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వీసీలను తరిమి తరిమి కొడుతున్నారని ఆరోపించారు. బంగారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ టీడీపీ ఏ విధంగా తగలబెడుతోందో అందరూ గమనించాలని అన్నారు. ఇవాళ రాష్ట్రం ఉన్న దుస్థితిని తలచుకుంటే కన్నీళ్లు వస్తున్నాయని తెలిపారు.
“మంగళగిరిలో లోకేశ్ మనుషులు మా సోషల్ మీడియా కార్యకర్త రాజ్ కుమార్ పట్ల ఎంత అమానుషంగా ప్రవర్తించారో వీడియోలో చూశాం. ఇలాంటి ఘటనలు రాష్ట్రానికే కాదు దేశానికే అవమానం. ఏపీలో ఇలాంటి ఘటనలు జరుగుతోంటే కేంద్ర ప్రభుత్వం కూడా తలవంచుకోవాలి.
టీడీపీ పాల్పడుతున్న ఈ చర్యల్లో కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ కూడా భాగస్వాములే. ఈ కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలను ఏ రకంగా కాపాడుతుంది? ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా నిలబెడుతుంది? సాక్షి, ఎన్టీవీ, టీవీ9 వంటి మీడియా సంస్థలను కూడా అణచివేస్తున్నారు. ఎంఎస్ఓల ద్వారా ఆయా చానళ్లు ప్రసారం కాకుండా అడ్డుకుంటున్నారు.
ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో రాజ్యాంగం కుప్పకూలిపోయింది. ఈ వారం పది రోజుల్లో రాష్ట్రంలో పలు చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. మొత్తం 27 ఘటనలను రాష్ట్రపతి, ప్రధానమంత్రి, జాతీయ మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకెళ్లామని వెల్లడించారు.