- ఓ చిన్నారి తొలి పుట్టిన రోజు వేడుకల్లో అపశృతి
- బాణసంచా నిప్పురవ్వలు బిడ్డవైపు దూసుకురావడంతో బెదిరిన చిన్నారి
- ఏడుస్తున్న బిడ్డను పట్టించుకోకుండా తన భార్యకు ఏంకాకూడదని తాపత్రయ పడ్డ భర్త
- నెట్టింట వైరల్ గా మారిన ఘటనపై జనాల విమర్శలు
కన్నబిడ్డలు అపాయంలో ఉంటే తల్లిదండ్రులు తమ ప్రాణాలను అడ్డేసేందుకు సైతం వెనకాడరు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఇందుకు భిన్నంగా బిడ్దను నిర్లక్ష్యం చేసి భార్య బాగోగులపైనే దృష్టిపెట్టడం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
నెట్టింట వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ యువ దంపతులు తమ బిడ్ద తొలి పుట్టిన రోజు వేడుకలను ఆర్భాటంగా నిర్వహించారు. ఈ క్రమంలో రంగురంగుల పూలతో అలంకరించిన ట్రాలీలో చిన్నారిని కూర్చోపెట్టి ఆ పక్కనే బాణసంచా పేల్చారు. అయితే, ప్రమాదవశాత్తూ కొన్ని నిప్పురవ్వలు చిన్నారితో పాటు బాలిక తల్లివైపు దూసుకొచ్చాయి. ఈ క్రమంలో బాలిక భయపడి ఏడుస్తుంటే అక్కడే ఉన్న తండ్రి మాత్రం బిడ్డ బాగోగులు మరిచి పక్కనే ఉన్న తన భార్యపైనే దృష్టిపెట్టాడు. కనీసం బిడ్డను లేవనెత్తేందుకు కూడా ముందుకు రాలేదు. అక్కడే ఉన్న మరో మహిళ బిడ్డను ఎత్తుకుని ఊరడించింది.
ఈ ఘటన తాలూకు వీడియో నెట్టింట వైరల్ అవుతుండటంతో జనాలు పాప తండ్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల్లో ఇలాంటి నిర్లక్ష్యం తామెప్పుడూ చూడలేదని మండిపడుతున్నారు.