Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

రుషికొండ రాద్ధాంతం …టీడీపీ ,వైసీపీ పరస్పర విమర్శలు

  • నేడు మీడియా ప్రతినిధులతో కలిసి రుషికొండ ప్యాలెస్ లోకి ప్రవేశించిన గంటా
  • లోపల అడుగడుగునా రిచ్ నెస్
  • ఆశ్చర్యపోయిన గంటా, మీడియా ప్రతినిధులు
  • రూ.500 కోట్లతో ఈ భవనం కట్టారన్న గంటా
  • దీన్ని స్టార్ హోటల్  గా ఉపయోగించుకునే వీల్లేకుండా కట్టారని వెల్లడి
  • దీన్ని ఎలా ఉపయోగించుకోవాలన్న దానిపై సీఎం నిర్ణయిస్తారని స్పష్టీకరణ

ఈ ఎన్నికల్లో వైసీపీ గెలిచి ఉంటే విశాఖ రాజధాని కావడం, జగన్ రుషికొండ ప్యాలెస్ నుంచి పరిపాలన సాగించడం జరిగేవి. కానీ, ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలవడంతో జగన్ అనుకున్నవేవీ జరగలేదు. ఈ నేపథ్యంలో, టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నేడు మీడియా ప్రతినిధులతో కలిసి రుషికొండ ప్యాలెస్ లోకి ప్రవేశించారు. 

ఇప్పటివరకు రుషికొండపై జరుగుతున్న నిర్మాణాల్లో ఏముందో ఎవరికీ తెలియదు. ఇప్పుడా రహస్యాన్ని గంటా శ్రీనివాసరావు బట్టబయలు చేశారు. రుషికొండ ప్యాలెస్ ను కళ్లు చెదిరే రీతిలో అత్యంత విలాసవంతంగా నిర్మించారని విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. ఆ భవనం లోపల ఏర్పాట్లు చూసి గంటా, మీడియా రిపోర్టర్లు ఆశ్చర్యపోయారు.

రుషికొండ ప్యాలెస్ ను పరిశీలించిన అనంతరం గంటా శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. జగన్ నిబంధనలకు విరుద్ధంగా, రూ.500 కోట్ల భారీ వ్యయంతో అత్యంత రహస్యంగా ఈ ప్యాలెస్ నిర్మించారని వెల్లడించారు. 61 ఎకరాల్లో  ఈ భవన సముదాయాలు నిర్మించారని, అందులో రాజసౌధాన్ని తలపించేలా ఉన్న భవనం కోసమే రూ.500 కోట్లు ఖర్చు చేశారని గంటా ఆరోపించారు. 

గతంలో ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్, గాలి జనార్దన్ రెడ్డి వంటి వారు కూడా ఇలాంటి రాజమహల్ లను నిర్మించకున్నారని తెలిపారు. ఈ భవనం లోపల పరిశీలిస్తే… దీన్ని హోటల్ మాదిరిగా వినిగించుకునే అవకాశం లేదని, పెద్ద కాన్ఫరెన్స్ హాలు కూడా ఉందని, ఇక్కడ్నించే సమీక్షలు చేపట్టేందుకు అనువుగా నిర్మించారని వివరించారు. ఇంత రహస్యంగా విలాసవంతమైన భవనం ఎందుకు కట్టారు? అని గంటా సూటిగా ప్రశ్నించారు. 

రుషికొండపై గతంలో టూరిజం కోసం హరిత రిసార్ట్స్ ఉండేవని, వీటి ద్వారా ఏటా రూ.8 కోట్ల వరకు ఆదాయం వచ్చేదని, ఈ రిసార్ట్స్ ను పడగొట్టి ప్యాలెస్ ను నిర్మించారని మండిపడ్డారు. ఆఖరికి కోర్టులను కూడా తప్పుదోవ పట్టించి ఈ విలాస భవనం నిర్మించారని విమర్శించారు. మొదట స్టార్ హోటల్ అన్నారని, ఆ తర్వాత సీఎం క్యాంపు కార్యాలయం అన్నారని, అనంతరం టూరిజం ప్రాజెక్టు అని చెప్పారని ఆరోపించారు. 

కొందరు దీనిపై న్యాయపోరాటం చేయగా, హైకోర్టు నిపుణుల కమిటీ వేసిందని గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. పలు చోట్ల నిబంధనల ఉల్లంఘన జరిగిందని కమిటీ పేర్కొందని, అయినప్పటికీ నిర్మాణాలు కొనసాగించారని ఆరోపించారు. 

ఈ భవనం నిర్మాణ అంచనాలు కూడా చాలా గోప్యంగా ఉంచారని, నిర్మాణ కాంట్రాక్టు సైతం వైసీపీ అనుకూల వ్యక్తులకే దక్కిందని తెలిపారు. రూ.91 కోట్ల వ్యయంతో స్టార్ హోటల్ కడుతున్నామని చెప్పి భవన నిర్మాణం ప్రారంభించారని, ఇది 15 నెలల్లోనే పూర్తవుతుందని చెప్పారని గంటా వివరించారు. కానీ, చదును చేసే పనుల కోసమే ఏకంగా రూ.95 కోట్లు ఖర్చయిందని, ఇక్కడి పరిసరాలను రమణీయంగా తీర్చిదిద్దేందుకు మరో రూ.21 కోట్లు ఖర్చు చేశారని వివరించారు. 

ఈ పనుల గురించి ఎవరికీ తెలియకుండా ఉండేందుకు 20 అడుగుల బారికేడ్లు పెట్టేవారని వెల్లడించారు. కనీసం చంద్రబాబు, పవన్ కల్యాణ్ వంటి అగ్రనేతలు సైతం రుషికొండ నిర్మాణాలు పరిశీలించే వీల్లేకుండా చేశారని తెలిపారు. 

ఇంత ఖర్చు పెట్టి కట్టిన భవనంలోకి ఆఖరికి జగన్ అడుగుపెట్టడం కాదు కదా, కంటితో చూడ్డానికి కూడా రాలేని పరిస్థితి ఏర్పడిందని గంటా వ్యంగ్యం ప్రదర్శించారు. తాను ఒకటి తలిస్తే, దైవం మరొకటి తలచినట్టుగా… జగన్ ఈ భవనంలో అడుగుపెట్టకుండానే అధికారం నుంచి దిగిపోవాల్సి వచ్చిందని ఎద్దేవా చేశారు. 

2019 ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన జగన్… ప్రజాతీర్పును అపహాస్యం చేసేలా పాలన కొనసాగించాడని, దాని ఫలితమే ఇటీవలి ఎన్నికల్లో ప్రజలు ఆయనను చిత్తుగా ఓడించారని అన్నారు. విశాఖ ప్రాంతంలో వైసీపీని ప్రజలు తుడిచిపెట్టారని, తద్వారా విశాఖ రాజధాని వద్దన్న సంకేతాలను బలంగా పంపించారని గంటా స్పష్టం చేశారు. ఈ భారీ భవనాన్ని ఎలా ఉపయోగించుకోవాలన్న దానిపై సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు.

అది మీ పైత్యం… రుషికొండ భవనాలపై స్పందించిన వైసీపీ

YCP reacts to TDP comments on Rishikonda constructions
  • రుషికొండ భవనాలను పరిశీలించిన టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు
  • వైసీపీ నాయకత్వంపై విమర్శలు
  • రుషికొండలో ఉన్నది ప్రైవేటు ఆస్తులు కాదన్న వైసీపీ
  • అవి ప్రభుత్వ భవనాలేనని స్పష్టీకరణ

రుషికొండలో భవనాలను టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు పరిశీలించి, మీడియా సమావేశం ఏర్పాటు చేసి తీవ్ర విమర్శలు చేయడం తెలిసిందే. దీనిపై వైసీపీ స్పందించింది. రుషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే అని స్పష్టం చేసింది. 

రుషికొండ రిసార్ట్స్ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు తీసి, పైత్యం ప్రదర్శించడం వల్ల మీకు మానసిక తృప్తి కలుగుతుందేమో కానీ… విశాఖపట్నం ప్రజలకు మేలు జరగదు అని టీడీపీ నేతలను ఉద్దేశించి విమర్శించింది. 

“రుషికొండలో ఉన్నది ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు. అవేమీ ప్రైవేటు ఆస్తులు కావు. ఆ భవనాలు ఎవరి సొంతం కూడా కావు. విశాఖ నగరానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఆ భవనాలు నిర్మించారు. వాటిని ఎలా వినియోగించుకోవాలన్నది అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇష్టం. అటువంటి ప్రభుత్వ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు తీయించి, వాటికి వక్రీకరణలు  జోడించి బురద చల్లాలని ప్రయత్నించడం వెనుక ఉద్దేశాలేంటో ప్రజలు గమనిస్తున్నారు. 

1995 నుంచి కూడా విశాఖపట్నం ఆర్థిక రాజధాని అని చంద్రబాబు ఊదరగొడుతూనే ఉన్నాడు. ఇప్పటికి నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రి అయ్యాడు. విశాఖ నగరానికి ఒక రాష్ట్రపతి వచ్చినా, ఒక ప్రధానమంత్రి వచ్చినా, ముఖ్యమంత్రులు, గవర్నర్ లు వచ్చినా వారికి ఆతిథ్యం ఇవ్వడానికి సరైన భవనమే లేదన్న విషయాన్ని గుర్తించండి” అంటూ వైసీపీ ట్వీట్ చేసింది.

Related posts

జీవీఎల్…పాయింట్ అఫ్ ఆర్డర్…

Ram Narayana

నేను చంద్రబాబు అంత మంచోడ్ని కాదు: జేసీ ప్రభాకర్ రెడ్డి

Ram Narayana

పవన్ ఆదేశాలు… సరస్వతి పవర్ సంస్థ భూముల్లో అధికారుల సర్వే

Ram Narayana

Leave a Comment