Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

కొద్ది రోజుల్లోనే జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు…

– హెల్త్ కార్డులతో సహ డిమాండ్లన్నీ పరిష్కరిస్తాం

  • టియూడబ్ల్యూజె రాష్ట్ర మహాసభల్లో
    రాష్ట్ర సమాచార శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

– జర్నలిస్టులు వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలి..

  • మీడియా అకాడమీ ఛైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి

జర్నలిస్టులకు కొద్దిరోజుల్లోనే ఇళ్లస్థలాలు ఇస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్,
సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం ఖమ్మంలోని ఉషాహరి కన్వెన్షన్‌లోని అమర్‌నాధ్ ప్రాంగణంలో జరుగుతున్న టియూడబ్ల్యూజె(ఐజెయు) రాష్ట్ర మూడో మహాసభలను మంత్రి ప్రారంభించి ప్రసంగించారు. రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్ అద్యక్షతన జరిగిన ప్రారంభ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గత పదేళ్లుగా జర్నలిస్టులు భావ ప్రకటన చేయడానికి కూడా ఎంత ఇబ్బంది పడ్డారో అందరికీ తెలుసునని అన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం జర్నలిస్టుల డిమాండ్లను నూరుశాతం పరిష్కారం చేస్తుందని స్పష్టం చేశారు. ప్రధానంగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించి కొన్ని చోట్ల మంజూరైనప్పటికీ కోర్టులో వివాదం ఉందని, వాటి ద్వారా క్లియరెన్స్ వచ్చినప్పటికీ గత ప్రభుత్వం స్థలాలు ఇవ్వలేదని అన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీడియా అకాడమీ ఛైర్మన్‌గా ఐజెయూ జాతీయ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డిని
నియమించామన్నారు. ఆయన జర్నలిస్టుల సమస్యలపై సమగ్రంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వివరించారని అన్నారు. వారితో చర్చించి జర్నలిస్టుల ఇళ్లస్థలాలు ఇచ్చే విషయంలో ఒక సమగ్రమైన పాలసీని తీసుకొస్తున్నామని అన్నారు. ముందుగా ఖమ్మం నగరంలో ఇదివరకే జర్నలిస్టుల ఇళ్లస్థలాల కేటాయింపునకు ఒక జిఓ ఇచ్చారని, ఆ జీఓ అమలుకు ఇంకొంత పని ఉన్నప్పటికీ దానిని పరిష్కరించి కొద్దిరోజుల్లోనే ఇళ్లస్థలాలు ఇస్తామని అన్నారు. ముందుగా ఖమ్మం జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు కేటాయిస్తామన్నారు. జిఓ ప్రకారం స్థలం కొంత తక్కువగా ఉన్నందున వేరే చోట ఆ స్థలాన్నికేటాయించే విషయంలో జిల్లా కలెక్టర్‌తో తాను మాట్లాడి సాధ్యమైనంత త్వరగా స్థలాలు కేటాయించాలని ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. అక్రిడేషన్, హెల్త్ కార్డులు వంటి జర్నలిస్టుల డిమాండ్లు సమంజసమైనవని , గొంతెమ్మ కోర్కెలు కావని ఆయన అన్నారు. అక్రిడేషన్ల రెన్యువల్ మరో మూడు నెలల వరకు చేయాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.

  • జర్నలిస్టులు వృత్తినైపుణ్యం పెంచుకోవాలి … కె.శ్రీనివాసరెడ్డి

వర్కింగ్ జర్నలిస్టులు వృత్తి నైపుణ్యం పెంచుకోవాలని మీడియా అకాడమీ ఛైర్మన్
కె.శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. సమాజంలో ఆ వృత్తి పట్ల గౌరవాన్ని పెంచుకునే బాధ్యత కూడా వర్కింగ్ జర్నలిస్టులపైనే ఉందని ఆయన అన్నారు. మహాసభల్లో ఆయన ప్రసంగిస్తూ గత పదేళ్ల నుండి ఒక సమాచార శాఖా మంత్రి జర్నలిస్టుల వేదికపై కూర్చొవడం ఇదే తొలిసారి అని అన్నారు. గత పదేళ్లుగా జర్నలిస్టులు తమ సమస్యలను చెప్పుకునేందుకు నాటి ముఖ్యమంత్రిని కలిసే అవకాశం లేదని, ఇక సమాచార శాఖ అంతర్ధానం అయిపోయిందని ఆయన అన్నారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలనే ఒక మంచి ఉద్ధేశమున్న వ్యక్తి సమాచార శాఖా మంత్రి కావడం సంతోషకరమన్నారు. దేశంలో మోడల్ ప్రెస్‌క్లబ్ అనే బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోతున్నారని అన్నారు. ఆ బిల్లునున్యాయకోవిదులు, ఐఏఎస్ అధికారులు కలిసి రూపొందించారని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అదే తరహ బిల్లును తెలంగాణ రాష్ట్రంలో అమలులోకి తేవాలని సూచించారు. గత ప్రభుత్వం అకాడమీకి వంద కోట్లు కేటాయించినట్లు తాను ఓ పత్రికల్లో చదివానని, తాను ఛైర్మన్‌గా వచ్చిన తర్వాత అది నిజం కాదని తేలిందని, ఇలాంటి అవాస్తవపు ప్రకటనలు మానుకోవాలని హితవుపలికారు. జర్నలిస్టు ఉద్యమం రెండు తెలుగు రాష్ట్రాల్లో బలంగా ఉందని ఆయన పేర్కొన్నారు. 20 ఏళ్ల తర్వాత తనను మళ్లీ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా నియమించినందుకు ముఖ్యమంత్రికి, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంకా ఈ సభలో ఐజెయు మాజీ అధ్యక్షులు ఎస్‌ఎన్ సిన్హా మాట్లాడుతూ జర్నలిజం ప్రస్తుతం ప్రమాదంలో ఉందని, నిత్యం దాడులతో కాలం గడుస్తోందన్నారు. జర్నలిస్టులపై దాడులను అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడేందుకు జర్నలిస్టు వ్యవస్థ స్వేచ్ఛగా సాగాలన్నారు.

ప్రదీప్‌కుమార్ అధ్యక్షోపన్యాసం చేశారు. మాజీ ఎంఎల్‌ఏ గుమ్మడి నర్సయ్య, జెడ్పీ ఛైర్మన్ లింగాల కమల్‌రాజు, ఐజెయూ మాజీ అధ్యక్షులు దేవులపల్లి అమర్ తదితరులు ప్రసంగించారు. ఈ సభలో ఐజెయూ సెక్రటరీ జనరల్ బల్విందర్ సింగ్ జమ్మూ, రాష్ట్ర గిడ్డంగుల నిర్వహణా సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజీ ఎంఎల్‌సి పోట్ల నాగేశ్వరరావు, ఐజెయూ స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎంఏ మాజిద్, ఐజెయూ కార్యదర్శులు వై.నరేందర్ రెడ్డి, డి.సోమసుందర్, జాతీయ కార్యవర్గ సభ్యులు కల్లూరి సత్యనారాయణ, ఆలపాటి సురేష్‌కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.రాం నారాయణ, ఖమ్మం జిల్లా
అధ్యక్ష కార్యదర్శులు వనం వెంకటేశ్వర్లు, ఏనుగు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు….

Related posts

బద్ధ శత్రువులుగా ఉన్నోళ్లే కాంగ్రెస్‌లో చేరారు.. షర్మిల వస్తే తప్పేంటి?: భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు….

Drukpadam

సీఎం రేవంత్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగులేటి

Ram Narayana

కేటీఆర్ సవాల్ ను స్వీకరించిన రేవంత్ రెడ్డి…!

Drukpadam

Leave a Comment