- వరల్డ్ కప్‌ను ముద్దాడుతున్న ఫొటోను షేర్ చేసిన రోహిత్ శర్మ
- ఈ ఫొటో తన భావోద్వేగాలకు అసలైన ఉదాహరణ అని కామెంట్
- తన సంతోషాన్ని వ్యక్తీకరించేందుకు మాటలు రావట్లేదని వెల్లడి
- కోట్లాది మంది కల నెరవేరినందుకు సంతోషంలో మునిగి తేలుతున్నానని వ్యాఖ్య
టీ20 వరల్డ్ కప్ భారత్ కైవసం కావడంతో రోహిత్ శర్మ తన ఫ్యాన్స్ కోసం మనసుకు హత్తుకునే పోస్టు నెట్టింట పంచుకున్నాడు. కప్ చేజిక్కించుకున్న ఓ రోజు తరువాత తన మనసులో భావాలకు సోషల్ మీడియా వేదికగా అక్షర రూపం ఇచ్చాడు.
‘‘నా మనసులో భావాలకు ఈ చిత్రమే సరైన ఉదాహరణ. నా సంతోషాన్ని వ్యక్తీకరించేందుకు మాటలు చాలట్లేదు. ఈ విజయం నాకు ఎంత ముఖ్యమో వర్ణించడం కష్టం. భవిష్యత్తులో దీనిపై మరింత వివరిస్తా. కానీ ఇప్పుడు కోట్లాది మంది ప్రజల కల నిజమైనందుకు ఆనందంలో మునిగితేలుతున్నా’’ అని రోహిత్ శర్మ పోస్టు చేశాడు.
ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్స్‌లో టీమిండియా ప్రపంచకప్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం తాజా విజయంతో టీ20 ప్రపంచకప్ మళ్లీ భారత్ వశమైంది.
కప్ గెలిచిన అనంతరం, రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. మొత్తం 159 టీ20 మ్యాచుల్లో 4231 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మన్ గా టీ20 కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పెట్టాడు. పొట్టి ఫార్మాట్ లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా, రెండు సార్లు టీ20 ప్రపంచకప్ ముద్దాడిన ఆటగాడిగా ఘనత కూడా సాధించాడు.