- ఉత్తర కెంటకీలోని ఫ్లోరెన్స్ నగరంలో ఘటన
- తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు యత్నం
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
అమెరికాలో మరోమారు కాల్పుల మోత మోగింది. ఉత్తర కెంటకీలోని ఫ్లోరెన్స్ సిటీలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. కాల్పుల అనంతరం పరారైన నిందితుడిని పోలీసులు చేజ్ చేసే క్రమంలో అతడి కారు గుంతలో పడింది. తెల్లవారుజామున 2.50 గంటలకు ఓ ఇంట్లో ఈ ఘటన జరిగిందని, సమాచారం అందుకుని వెళ్లేసరికి ఏడుగురు బాధితులు కనిపించినట్టు పోలీసులు తెలిపారు.
అప్పటికే నలుగురు ప్రాణాలు కోల్పోగా తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని తాము పట్టుకున్నామని, అప్పటికే అతడు తనకు తాను కాల్చుకుని ఆత్మహత్యకు యత్నించినట్టు పోలీసులు తెలిపారు. అతడిని ఆసుపత్రిలో చేర్చగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్టు తెలిపారు. బర్త్ డే పార్టీ సందర్భంగా ఈ ఘటన జరిగిందని, నిందితుడు ఇంటి యజమాని కొడుకే(21)నని, ఈ ఘటనలో ఇంటి యజమాని కూడా మృతి చెందినట్టు చెప్పారు.