- పూరిలో జగన్నాథస్వామి రథయాత్ర
- బలరామ సుభద్రలతో కొలువైన జగన్నాథుడు
- ఇంద్రద్యుమ్న మహారాజు భార్యనే గుండికాదేవి
- ఆమె పేరుతో జరిగేదే ‘గుండీచయాత్ర’
పూరి అనగానే ‘ఆషాఢ విదియ’ రోజున అక్కడ జరిగే రథోత్సవమే కళ్లముందు కదలాడుతుంది. ప్రపంచంలో మరెక్కడా ఈ స్థాయిలో జరిగే రథోత్సవం లేదు. అత్యంత నియమనిష్ఠలు పాటిస్తూ ఏ ఏడాదికి ఆ ఏడాది కొత్త రథాలను తయారు చేయడం ఇక్కడ మాత్రమే కనిపించే విశేషం. ఇక ఇక్కడి గర్భాలయంలో కొయ్యతో చేసిన మూల మూర్తులను .. అందునా అసంపూర్ణ విగ్రహాలను పూజించడం మరో విశేషం. ఇంద్రద్యుమ్న మహారాజు కాలంలో ఆకాశవాణి పలికినట్టుగానే ఇక్కడ పూజలు .. ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి.
జగన్నాథుడు .. బలభద్రుడు .. సుభద్ర మూర్తులు కొయ్యతో మాత్రమే చేయడం వెనుక ఒక కథనం వినిపిస్తూ ఉంటుంది. ఆకాశవాణి పలికినట్టుగా కొయ్యతో మూర్తులను చేయించడానికి ఇంద్రద్యుమ్న మహారాజు సన్నాహాలు చేస్తాడు. అయితే ఆయన పిలిపిస్తే వచ్చిన శిల్పులు ఎవరూ ఆ కొయ్యదుంగపై ‘ఉలి’ పెట్టలేకపోతారు. అదే సమయంలో తనకి అవకాశం ఇవ్వమని అంటూ ఒక వృద్ధుడు అక్కడికి వస్తాడు. అందుకు ఆ రాజు తన అంగీకారాన్ని తెలియజేస్తాడు.
అయితే తాను ఆ కొయ్యదుంగను విగ్రహాలుగా మార్చడానికి 21 రోజులు పడుతుందని ఆ శిల్పి చెబుతాడు. ఒక గదిలో తాను ఈ పనిని రహస్యంగా చేస్తాననీ, ఆ సమయంలో తనకి ఎవరూ ఎలాంటి అంతరాయాన్ని కలిగించకూడదనే షరతు పెడతాడు. గడువులోగా విగ్రహాలను ఎవరు చూసినా, అవి అలాగే అసంపూర్ణంగా మిగిలిపోతాయని అంటాడు. అందుకు అంగీకరించిన రాజు, తగిన ఏర్పాట్లు చేయిస్తాడు. ఆ శిల్పి ఒక గదిలోకి వెళ్లి తన పని మొదలుపెడతాడు.
15 రోజుల తరువాత రాణి గుండికాదేవి ఆ గది వైపు వస్తుంది. లోపలికి వెళ్లిన శిల్పి ఎలాంటి ఆహరం తీసుకోవడం లేదు .. మంచినీళ్లు కూడా అడగడం లేదు. పైగా లోపల నుంచి ఎలాంటి శబ్దాలు రావడం లేదు . ఏమైందో ఏమిటోనని కంగారు పడుతూ, రాజుగారి దగ్గర ఆందోళన వ్యక్తం చేస్తుంది. దాంతో రాజుగారు హడావిడిగా తలుపులు తెరిపిస్తాడు. ఆ శిల్పి మాయమైపోగా .. అతను అప్పటివరకూ మలచిన విగ్రహాలు అసంపూర్ణంగా కనిపిస్తాయి. అప్పుడు ఆ శిల్పి పెట్టిన షరతు గుర్తొచ్చి రాజదంపతులు బాధపడతారు. ఆకాశవాణి చెప్పిన మేరకూ అదే సంప్రదాన్ని ఆచరిస్తూ అసంపూర్ణ విగ్రహాలకే పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి 12 ఏళ్లకి ఒకసారి మూలమూర్తులను మారుస్తూ ఉంటారు. ఇంద్రద్యుమ్న మహారాజు భార్య గుండికాదేవి పేరుతో జరిగేదే ‘గుండీచయాత్ర’.