- భారత్ వైదొలగితే ఆ స్థానంలో ఆడనున్న శ్రీలంక
- వన్డే వరల్డ్ కప్ 2023లో 9వ స్థానంలో నిలవడంతో అవకాశం
- భద్రతా కారణాల రీత్యా పాకిస్థాన్‌లో ఆడబోమంటూ ఐసీసీకి తెలిపిన బీసీసీఐ
- తటస్థ వేదికల్లో నిర్వహించాలని ప్రతిపాదన
వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు పాకిస్థాన్ అతిథ్యం ఇస్తోంది. అయితే భారత క్రికెట్ జట్టు ఆ దేశానికి వెళ్లేందుకు బీసీసీఐ ససేమిరా అంటున్నట్టు తెలుస్తోంది. అయితే పాకిస్థాన్ మాత్రం టోర్నీకి సంబంధించిన ముసాయిదా షెడ్యూల్‌ను ఐసీసీకి సమర్పించింది. భారత్ ఆడే అన్ని మ్యాచ్‌లకు లాహోర్‌ను ఏకైక వేదికగా పేర్కొంది.
అయితే ఆటగాళ్ల భద్రతా కారణాల రీత్యా పాకిస్థాన్‌కు జట్టుని పంపించలేమంటూ ఐసీసీకి బీసీసీఐ చెప్పినట్టుగా తెలుస్తోంది. హైబ్రిడ్ మోడల్‌లో తమ మ్యాచ్‌లకు దుబాయ్ లేదా శ్రీలంక వంటి తటస్థ వేదికలకు మార్చాలని కోరినట్టు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. బీసీసీఐ విజ్ఞప్తిపై ఐసీసీలో ఇప్పటివరకు అధికారిక చర్చ జరగలేదు.
బీసీసీఐ ప్రతిపాదనపై అధికారిక చర్చ ఇంకా జరగలేదు. అయితే భారత్ డిమాండ్‌కు అంగీకరించడం తప్ప పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు మరొక ఆప్షన్ ఉండకపోవచ్చునని క్రికెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పాకిస్థాన్‌లో ఆడేందుకు బీసీసీఐకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం లభించడం దాదాపు అసంభవంగా కనిపిస్తోంది. ఒకవేళ పాకిస్థాన్ అంగీకరించకుండా అన్ని మ్యాచ్‌లూ పాకిస్థాన్‌లోనే జరగాలని పట్టుపడితే టోర్నీ నుంచి నిష్క్రమించడం తప్ప భారత్‌కు వేరే ఆప్షన్ ఉండదు.
ఒకవేళ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి భారత్ వైదొలిగితే ఆ స్థానంలో శ్రీలంక ఆడాల్సి ఉంటుంది. 2023 వన్డే వరల్డ్ కప్‌లో 9వ స్థానంలో నిలవడంతో శ్రీలంకకు ఈ ఛాన్స్ దక్కుతుంది. కాగా గతేడాది జరిగిన ఆసియా కప్ 2023కు కూడా పాకిస్థాన్ ఆతిథ్యం ఇచ్చింది. అక్కడికి వెళ్లి ఆడేందుకు భారత్ నిరాకరించడంతో భారత్ మ్యాచ్‌లను శ్రీలంకలో నిర్వహించారు. కాగా 2008లో ఆసియా కప్ తర్వాత భారత క్రికెట్ జట్టు ఇప్పటివరకు పాకిస్థాన్‌లో ఆడలేదు. ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లకు భారత్-పాకిస్థాన్ దూరంగా ఉంటున్నాయి. ఐసీసీ లేదా ఆసియా కప్‌లలో మాత్రమే ఈ రెండు జట్లు తలపడుతున్నాయి.