- ఓవర్ ల్యాపింగ్ లేకుండానే పోటీ పరీక్షలను నిర్వహిస్తామని వెల్లడి
- ప్రతి అసెంబ్లీ స్థానంలో అంబేడ్కర్ నాలెడ్జ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్న భట్టివిక్రమార్క
- పరీక్షల వాయిదాకు ప్రభుత్వం అంగీకరించిందన్న మల్లు రవి
త్వరలో ఉద్యోగ ఖాళీలపై జాబ్ క్యాలెండర్‌ను ప్రకటిస్తామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఓవర్ ల్యాపింగ్ లేకుండానే పోటీ పరీక్షలను నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. త్వరలో ప్రతి అసెంబ్లీ స్థానంలో అంబేడ్కర్ నాలెడ్జ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు.
సచివాలయంలో గ్రూప్-2 అభ్యర్థులతో పరీక్షలపై చర్చించారు. విద్యార్థుల డిమాండ్ మేరకు గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డికి ఫోన్ చేసి డిసెంబర్‌లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించడాన్ని పరిశీలించాలన్నారు.
మరోవైపు, గ్రూప్ 2, 3 పరీక్షల వాయిదాకు ప్రభుత్వం అంగీకరించిందని ఎంపీ మల్లు రవి తెలిపారు. పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం త్వరలో తేదీని ప్రకటిస్తుందన్నారు. షెడ్యూల్ ప్రకారం గ్రూప్ 2 పరీక్షలు ఆగస్ట్ 7, 8 తేదీల్లో జరగాల్సి ఉంది. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం వాయిదా వేసింది.