- నాగర్‌కర్నూల్‌లోని హాజీపూర్‌లో ఘటన
- ఇంట్లో పని ఉందని చెప్పి మహిళా కూలీలను ఇంటికి తీసుకొచ్చిన ఇద్దరు నిందితులు
- పని పూర్తయ్యాక కారులో బయటకు తీసుకెళ్లి మద్యం తాగించిన వైనం
- మత్తులో ఉన్న మహిళల పై అత్యాచారం
- బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుల అరెస్టు
నాగర్‌కర్నూల్ జిల్లాలో తాజాగా దారుణం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మహిళా కూలీలపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. శ్రీశైలం – హైదరాబాద్ జాతీయ రహదారి సమీపంలోని హాజీపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం, బల్మూర్ మండలంలోని వేర్వేరు గ్రామాలకు చెందిన ఇద్దరు మహిళలు అచ్చంపేటకు వచ్చి రోజువారీ కూలీలుగా పనిచేస్తున్నారు. గురువారం కూడా వారు పని కోసం రాగా పట్టణంలో బండల దుకాణాలు నిర్వహించే ఇద్దరు వ్యక్తులు వినోద్ సింగ్, గజానంద్ సింగ్ తమ ఇంట్లో పని ఉందని కూలి మాట్లాడుకుని మహిళలను తీసుకెళ్లారు. ఇంటిని శుభ్రం చేయించుకున్నారు. పని పూర్తయ్యాక మాటల్లో దింపి, ఇద్దరినీ కారులో ఎక్కించుకుని నల్గొండ జిల్లా డిండివైపు తీసుకెళ్లి మద్యం తాగించారు.
శ్రీశైలం – హైదరాబాద్ జాతీయ రహదారి సమీపంలోని హజీపూర్ శివారు ప్రాంతంలో కారు నిలిపి మత్తులో ఉన్న మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారు. తిరిగి సాయంత్రం 6 గంటల సమయంలో అచ్చంపేట శివారులోని క్రీడా మైదానం సమీపంలో మహిళలను వదిలేశారు. అపస్మారక స్థితిలో ఉన్న మహిళలను గమనించిన స్థానికులు డయల్ 100, 108లకు సమాచారం ఇచ్చారు. బాధిత మహిళల ఫిర్యాదు మేరకు రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్టు చెప్పారు.