- డొనాల్డ్ ట్రంప్‌కు దీటైన అభ్యర్థిని ఎన్నుకోవాలని డెమోక్రాట్లకు భారత సంతతి సీఈఓ వినోద్ ఖోస్లా పిలుపు
- ట్రంప్‌ను సమర్థిస్తూ రిప్లై ఇచ్చిన ఎలాన్ మస్క్
- విలువలు లేని వారిని, అత్యాచారం చేసే వారిని సమర్థించలేనంటూ వినోద్ ఘాటు వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకున్నట్టు జో బైడెన్ ప్రకటించడం అగ్రరాజ్య రాజకీయాల్లో పెను కలకలానికి దారి తీసింది. అధ్యక్ష అభ్యర్థిగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేరును సమర్థిస్తున్నట్టు కూడా బైడెన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో భారత అమెరికన్ సీఈఓ వినోద్ ఖోస్లా, టెక్ ఎంటర్ ప్రెన్యూర్ ఎలాన్ మస్క్‌ల మధ్య రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ విషయంలో మాటల యుద్ధం మొదలైంది.
డొనాల్డ్ ట్రంప్‌కు దీటైన అభ్యర్థిని డెమోక్రాట్లు ఎన్నుకోవాలంటూ తొలుత వినోద్ ఖోస్లా ట్వీట్ చేశారు. ‘‘ట్రంప్‌ను సులువుగా ఓడించే అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకునేందుకు ఓపెన్ కన్వేన్షన్ నిర్వహించేందుకు సమయం ఆసన్నమైంది. @GovWhitmer లేదా @GovernorShapiro ఇందుకు తగిన వారు. అతివాదుల చెరలో అమెరికా చిక్కుకోకుండా వీళ్లు ఆపగల సమర్థులు. లెఫ్ట్, రైట్ భావజాలం కాకుండా మధ్యేమార్గం ఎంచుకునేందుకు ఇదే సరైన సమయం. ఆర్థికంగా, పర్యావరణ పరంగా బాధ్యతాయుతమైన వైఖరి కోరుకునే వారందరూ దీన్ని సమర్థించాలి’’ అని ఆయన ట్వీట్ చేశారు.
ఈ పోస్టుకు వెంటనే స్పందించిన ఎలాన్ మస్క్ ట్రంప్ కంటే మంచి అభ్యర్థి లేడనే అర్థం వచ్చేలా పోస్టు పెట్టారు. దీనిపై వినోద్ ఖోస్లా ఘాటుగా స్పందించారు. ‘‘అత్యాచారాలు, అబద్ధాలు చెప్పేవారు, మహిళల్ని కించపరిచే వారు, కనీస విలువలు లేని వారిని సమర్థించలేను. ఆయన పన్నులు తగ్గించొచ్చు, నిబంధనలను సరళీకరించొచ్చు. అంతమాత్రాన విలువల లేమిని అంగీకరించలేము కదా. పర్యావరణ రక్షణలో దేశాన్ని పదేళ్ల వెనక్కు తీసుకెళ్లే వాళ్లు అధ్యక్షుడిగా ఉండాలని కోరుకుంటామా? అలాంటి వాళ్లు నీ సంతానానికి అదర్శం కావాలని కోరుకుంటావా?” అంటూ సూటి వ్యాఖ్యలు చేశారు. దీంతో, వీరిద్దరి సంవాదం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.