దాశరథి కృష్ణమాచార్యులు ధన్యజీవి
తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా దాశరథి
దాశరథి కృష్ణమాచార్యులు జయంతి సందర్భంగా బిఆర్ఎస్ మాజీ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు ఆయన్ని స్మరించుకుంటూ ఘనంగా నివాళ్లుర్పించారు. నాడు దాశరథి రగిల్చిన చైతన్య స్ఫూర్తి తోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కావాల్సిన సంకల్ప బలాన్ని ఇచ్చిందని నామ పేర్కొన్నారు. దాశరథి కృష్ణమాచార్యులు తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిన గొప్ప స్వాతంత్ర సమరయోధుడు, కవి మరియు రచయిత అని అన్నారు. ఆయన రచనలు తెలంగాణ సాంస్కృతిక, సాహితీ రంగాల్లో విశేషమైన ప్రభావాన్ని చూపించాయన్నారు. ఆధునిక తెలుగు సాహిత్యంలో ఆయనదో విశిష్టశైలని దాశరథి గారు తన సాహిత్యంతో తెలంగాణ ప్రజల్లో దేశభక్తి, సంఘీభావం, మరియు స్వాతంత్ర పట్ల అవగాహన పెంపొందించారని “నా తెలంగాణ కోటి రతనాల వీణ” అనే పంక్తి ఆయన రచనలోని ఒక ప్రముఖమైనది గా నామ పేర్కొన్నారు. ఇది తెలంగాణ ప్రాంతం యొక్క సౌందర్యాన్ని మరియు వైభవాన్ని వర్ణిస్తుంది. “మా నిజాం రాజు జన్మజన్మల బూజు” అనే మాటలు దాశరథి గారి రచనలోని నిజాం పాలనలో తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్న నిర్బంధాన్ని మరియు బాధలను ప్రతిబింబిస్తుందన్నారు. దాశరథి గారి రచనలను పరిశీలిస్తే, ఆయన తెలంగాణ ప్రజల జీవన స్థితిగతులను, వారి సమస్యలను, మరియు ఆశయాలను ప్రతిబింబిస్తూ ఉంటారు. తెలంగాణ భాష, సంస్కృతి, మరియు సాంప్రదాయాలను సాహిత్యంలో అత్యంత రమ్యంగా, ప్రేరణాత్మకంగా వర్ణించడంలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి, రాసిన పాటలు, కవితలు ఇప్పటికీ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నాయి. ఆయన సాహిత్య కృషి తెలంగాణ ప్రాంతం యొక్క సాహితీ వైభవాన్ని సమర్థంగా ప్రతిబింబించడమే కాకుండా, తెలంగాణ సమాజంలో మార్పు తీసుకురావడంలో కీలక పాత్ర వహించిందని నామ తెలిపారు. దాశరథి బాల్యం, చదువు తాను ప్రాతినిధ్యం వహించిన ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉండటం చాలా సంతోషంగా ఉందని నామ అన్నారు.