- నిన్న పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు
- వినూత్న రీతిలో నదిపై ప్రారంభోత్సవం
- బోట్లలో వచ్చిన వివిధ దేశాల క్రీడా బృందాలు
- దక్షిణ కొరియా బృందం వస్తుంటే ఉత్తర కొరియా పేరు ప్రకటించిన నిర్వాహకులు
పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు దక్షిణ కొరియా దేశానికి క్షమాపణలు తెలిపారు. అసలేం జరిగిందంటే… పారిస్ ఒలింపిక్ క్రీడల ప్రారంభ వేడుకలను వినూత్న రీతిలో సెన్ నదిపై నిర్వహించారు. ఒక్కో దేశ అథ్లెట్ల బృందం ఒక్కో బోటులో వస్తుంటే… ఆ దేశం పేరును పరిచయం చేస్తూ నిర్వాహకులు అనౌన్స్ మెంట్ చేశారు.
అయితే, దక్షిణ కొరియా అథ్లెట్లతో కూడిన బోటు వస్తుండగా… పారిస్ ఒలింపిక్ నిర్వాహకులు డెమొక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా (డీపీఆర్కే) అని ప్రకటించారు. వాస్తవానికి డీపీఆర్కే అని ఉత్తర కొరియాను పిలుస్తారు. దక్షిణ కొరియాను రిపబ్లిక్ ఆఫ్ కొరియా అని పిలుస్తారు.
పేరు తారుమారు చేసినట్టు గుర్తించిన పారిస్ ఒలింపిక్ నిర్వాహకులు… విచారం వ్యక్తం చేశారు. దక్షిణ కొరియాకు క్షమాపణలు తెలియజేశారు. ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మనీలో చోటు చేసుకున్న పొరపాటు పట్ల చింతిస్తున్నాం… దక్షిణ కొరియాను క్షమాపణలు కోరుతున్నాం అని ఓ ప్రకటన విడుదల చేశారు.
ఆ మేరకు దక్షిణ కొరియా భాషలో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ట్వీట్ చేసింది.