Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

అక్బరుద్దీన్ ఒవైసీని వచ్చేసారి కొడంగల్ నుంచి పోటీ చేయించి.. డిప్యూటీ సీఎం చేస్తా: రేవంత్ రెడ్డి

  • పాతబస్తీలో మెట్రో నిర్మాణం చేపడతామన్న రేవంత్ రెడ్డి
  • అభివృద్ధి చేసి చాంద్రాయణగుట్టకు వచ్చి కాంగ్రెస్ కోసం ఓట్లు అడుగుతానన్న సీఎం
  • అందుకే, అక్బరుద్దీన్‌కు కొడంగల్ బీఫామ్ ఇచ్చి గెలిపిస్తానన్న సీఎం

పాతబస్తీలో మెట్రో రైలు నిర్మాణాన్ని చేపడుతామని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయంలో చాంద్రాయణగుట్టకు వచ్చి కాంగ్రెస్ పార్టీ కోసం ఓట్లు అడుగుతానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ… అక్బరుద్దీన్ ఒవైసీని వచ్చేసారి కొడంగల్ నుంచి పోటీ చేయించి గెలిపిస్తానని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకు కొడంగల్ బీఫామ్ ఇచ్చి.. దగ్గరుండి నామినేషన్ వేయిస్తానని.. గెలిపించి ఉపముఖ్యమంత్రిని చేస్తానన్నారు.

రియల్ వ్యాపారుల కోసం మెట్రో ప్రతిపాదన

పాతబస్తీ మెట్రో నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. దీనిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. మెట్రో నిర్మాణం కోసం ఎల్ అండ్ టీతో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. హైటెక్ సిటీ నుంచి ఎయిర్‌పోర్ట్‌కు గత ప్రభుత్వం టెండర్లు పిలిచిందని మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ సంస్థల భూముల ధరలను పెంచేందుకే ఆ మార్గంలో మెట్రో రైలు ప్రతిపాదించారన్నారు.

ఇప్పటికే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి ఎయిర్‌పోర్ట్‌కు మంచి రోడ్లు ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం మెట్రో అవసరం లేని మార్గాల్లో మెట్రో నిర్మాణానికి టెండర్లు పిలిచారని ఆరోపించారు. తమ ప్రభుత్వం ఎల్బీ నగర్ నుంచి ఎయిర్ పోర్టుకు మెట్రో నిర్మిస్తుందన్నారు. పాతబస్తీకి మేలు కలిగేలా చాంద్రాయణగుట్ట మీదుగా మెట్రో నిర్మాణం చేపడతామన్నారు. 

ఓల్డ్ సిటీ కాదు… ఒరిజినల్ సిటీ

రెండో దశ మెట్రోకు నిధులు కోరితే కేంద్రం రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. పాతబస్తీకి, ఎయిర్ పోర్టుకు మెట్రోను కచ్చితంగా నిర్మిస్తామన్నారు. రెండో దశ మెట్రో నిర్మాణానికి భూసేకరణను ఇప్పటికే ప్రారంభించామన్నారు. పాతబస్తీని గత ప్రభుత్వం మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అది ఓల్డ్ సిటీ కాదు… ఒరిజినల్ సిటీ అని సీఎం వ్యాఖ్యానించారు. రెండో విడత మెట్రో విస్తరణపై గత ప్రభుత్వం కాకిలెక్కలు చెప్పిందని ఆరోపించారు.

హైదరాబాద్‌కు మెట్రో రైలు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు. తాము వచ్చాక పాతబస్తీ మెట్రో ప్రాజెక్టు విషయమై రీడిజైన్ చేశామన్నారు. తాను ముఖ్యమంత్రి కాగానే పాతబస్తీ మెట్రోపై దృష్టి సారించానన్నారు. బీఆర్ఎస్ మోసం చేయడం వల్లే పాతబస్తీ మెట్రో కల నెరవేరలేదన్నారు. గత ప్రభుత్వంలా హైదరాబాద్‌ను ఇస్తాంబుల్ చేస్తాం, లండన్ చేస్తామని తాము చెప్పమని… కానీ అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

పెద్దన్నలా ఉండాలని మోదీని కోరా

రాష్ట్రాల పట్ల పెద్దన్నలా వ్యవహరించాలని తాను ప్రధాని మోదీని పలుమార్లు కోరానన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రధానిని పెద్దన్న అంటే తప్పేమిటని ప్రశ్నించారు. అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని మోదీని కోరినట్లు చెప్పారు. కానీ కేవలం బీహార్, గుజరాత్ రాష్ట్రాలకే అధిక నిధులు కేటాయించారని ఆరోపించారు.

Related posts

కేసీఆర్ ను చూసి ఓటెయ్యండని ఎలా అడుగుతున్నారు కేటీఆర్ గారూ?: వైఎస్ షర్మిల

Ram Narayana

బీఆర్ యస్ 105 మంది అభ్యర్థుల ప్రకటించే ఛాన్స్ …! ఉండేదెవరు / ..ఊడేదెవరు …?

Ram Narayana

ఖమ్మం జిల్లాలో 7 నియోజకవర్గాలకు కాంగ్రెస్ అభ్యర్థులు ఫైనల్ …!

Ram Narayana

Leave a Comment