Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

బంగ్లాదేశ్ పరిణామాలు… కేంద్రానికి రాహుల్ గాంధీ మూడు కీలక ప్రశ్నలు…

  • ఈ పరిణామాలపై స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహం ఉందా? అని ప్రశ్న
  • ఢాకా పరిణామాల వెనుక పాక్ కుట్ర ఉందా? అని ప్రశ్న 
  • ఈ పరిణామాలను ఢిల్లీ ముందే ఉహించిందా? అని అడిగిన రాహుల్ గాంధీ
  • పరిస్థితిని భారత్ పర్యవేక్షిస్తోందన్న కేంద్రమంత్రి జైశంకర్

బంగ్లాదేశ్ పరిస్థితులపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్‌కు లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మూడు కీలక ప్రశ్నలు సంధించారు. వాటికి కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు, షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో నరేంద్రమోదీ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ ప్రశ్నలు సంధించారు.

ఢాకాలో అధికార మార్పిడి నేపథ్యంలో దౌత్యపరమైన పరిణామాలను ఎదుర్కోవడంలో ప్రభుత్వం వద్ద స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహం ఏమైనా ఉందా? అని రాహుల్ అడిగారు. జైశంకర్ స్పందిస్తూ… బంగ్లాదేశ్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని, అందుకు అనుగుణంగా మన చర్యలు ఉంటాయని సమాధానం చెప్పారు.

హసీనా రాజీనామాకు కొన్ని వారాల ముందు బంగ్లాదేశ్‌లో చోటు చేసుకున్న ఘటనల వెనుక విదేశీ శక్తుల ప్రమేయం ఉందా? ముఖ్యంగా పాక్ ప్రమేయం ఉందా? అని అడిగారు. ఈ విషయంలో అప్పుడే ఓ అంచనాకు రాలేమని, విచారణ చేస్తున్నామని కేంద్రమంత్రి తెలిపారు. అయితే బంగ్లాదేశ్ ఆందోళనలకు మద్దతుగా ఓ పాక్ దౌత్యవేత్త తన సోషల్ మీడియాలో ప్రొఫైల్ పిక్‌ను నిత్యం మారుస్తున్నట్లు గుర్తించామన్నారు. ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు.

బంగ్లాదేశ్ నాటకీయ పరిణామాలను న్యూఢిల్లీ ముందే ఊహించిందా? అని రాహుల్ తన మూడో ప్రశ్న అడిగారు. పరిస్థితిని భారత్ గమనిస్తోందని జైశంకర్ వెల్లడించారు. ఇదిలా ఉండగా, పొరుగు దేశం సంక్షోభాన్ని పరిష్కరించడంలో నరేంద్రమోదీ ప్రభుత్వానికి కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు పూర్తి మద్దతు ప్రకటించాయి.

Related posts

అస్సాంలో కొనసాగుతున్న భర్తల అరెస్టుల పర్వం.. కారణం ఇదే!

Drukpadam

భారత సరిహద్దులో టర్కిష్ డ్రోన్లను మోహరించిన బంగ్లాదేశ్.. ఇండియా హై అలెర్ట్

Ram Narayana

పోలికలేని ముడుసింహలు …కాంగ్రెస్ నేత జైరాం రమేష్ విమర్శ ….

Drukpadam

Leave a Comment