- బంగ్లాదేశ్ ను అట్టుడికించిన రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం
- కీలకపాత్ర పోషించిన విద్యార్థి నేతలు
- టెలికాం శాఖ మంత్రిగా నహీద్ ఇస్లాం
- క్రీడా శాఖ మంత్రిగా ఆసిఫ్ మహ్మద్
బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల కోటాను మార్చాలంటూ గత కొన్నాళ్లుగా సాగిన ఉద్యమం… కొన్ని వారాలుగా తీవ్ర రూపు దాల్చి చివరికి షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామాకు దారితీసింది. ఈ పోరాటంలో విద్యార్థి సంఘాల నేతలు కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వంలో విద్యార్థి సంఘాల నేతలకు కీలక మంత్రి పదవులు దక్కాయి.
ఇటీవల నిరసనలు, ఆందోళనల్లో ఎక్కువగా వినిపించిన పేరు నహీద్ ఇస్లామ్. నహీద్ ఓ విద్యార్థి సంఘం నేత. రిజర్వేషన్ల కోటా వ్యతిరేక ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. షేక్ హసీనా పదవికి రాజీనామా చేయక తప్పని పరిస్థితులను కల్పించడంలో నహీద్ ఇస్లామ్ దే ప్రముఖ పాత్ర అని బంగ్లాదేశ్ మీడియా పేర్కొంటోంది. ఇప్పుడతడికి బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వంలో టెలికమ్యూనికేషన్లు, సమాచార సాంకేతికత శాఖ మంత్రి పదవి లభించింది.
రిజర్వేషన్ వ్యతిరేక పోరాటంలో ప్రముఖ పాత్ర వహించిన మరో విద్యార్థి నేత… ఆసిఫ్ మహ్మద్. అతడికి క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖను అప్పగించారు.
నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ మార్గదర్శకత్వంలో పనిచేసేలా బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం గతరాత్రి ప్రమాణ స్వీకారం చేసింది. మధ్యంతర ప్రభుత్వానికి మహ్మద్ యూనస్ ప్రధాన సలహాదారుగా వ్యవహరించనున్నారు.