Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
సుప్రీం కోర్ట్ వార్తలు

మనీశ్ సిసోడియాకు బెయిల్.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

  • మళ్లీ ట్రయల్ కోర్టుకు పంపడమంటే వైకుంఠపాళీ ఆడినట్లేనని సుప్రీం వ్యాఖ్య
  • 17 నెలల తర్వాత బయటకు రానున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం
  • ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టు చేసిన సీబీఐ

ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మనీశ్ సిసోడియాకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. లిక్కర్ పాలసీ కేసులో సుమారు 17 నెలల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్న సిసోడియా జైలు నుంచి బయటకు అడుగుపెట్టనున్నారు. ఈ కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారణకు చేపట్టింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కేసు విచారణను సాగదీయడం సరికాదని, వేగంగా విచారణ పూర్తిచేయాలని కోరే హక్కు సిసోడియాకు ఉందని పేర్కొంది.

ట్రయల్ జరుగుతోందనే పేరుతో అనుమానితుడిని నిరవధికంగా జైలులో ఉంచుతామని అంటే ఒప్పుకోబోమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఈమేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ఈ కేసును విచారించారు. సిసోడియాను మళ్లీ ట్రయల్ కు పంపడమంటే అతడితో వైకుంఠపాళీ ఆడించినట్లేనని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. ఇది ఆయన ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని కూడా వ్యాఖ్యానించారు. బెయిల్ ఇవ్వకుండా సుదీర్ఘ కాలంపాటు జైలులో ఉంచడం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకారయోగ్యం కాదన్నారు.

బెయిల్ ఇవ్వకపోవడం అనుమానితుడిని శిక్షించడంగా భావించకూడదనే విషయాన్ని కింది కోర్టులు మరిచిపోయాయంటూ జస్టిస్ బీఆర్ గవాయి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా, ఈ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ సాక్షులుగా పేర్కొన్న 493 మంది ఇచ్చిన స్టేట్ మెంట్ లలోనూ మనీశ్ సిసోడియా కేసు ట్రయల్ ను మరింత పొడిగించేందుకు ఎలాంటి అవకాశాలు తమకు కనిపించలేదని వ్యాఖ్యానించారు.

Related posts

ఉత్పత్తుల నాణ్యత తెలుసుకోవడం వినియోగదారుడి ప్రాథమిక హక్కు: సుప్రీంకోర్టు

Ram Narayana

సుప్రీంకోర్టులో కేసీఆర్ కు ఎదురుదెబ్బ…

Ram Narayana

అవసరానికి భార్య స్త్రీధనం తీసుకుంటే భర్త దాన్ని తిరిగిచ్చేయాలి: సుప్రీం కోర్టు

Ram Narayana

Leave a Comment