- మృతి చెందిన వ్యక్తిని మైనాంక్ పటేల్‌గా గుర్తింపు
- ఆయన నిర్వహిస్తున్న స్టోర్‌లోనే కాల్పులు
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
అమెరికాలో ఓ స్టోర్‌లో కాల్పులు జరిగిన ఘటనలో భారత సంతతి వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాధ సంఘటన నార్త్ కరోలినాలోని అతని కన్వీనియెన్స్ స్టోర్‌లోనే జరిగింది. మృతి చెందిన వ్యక్తిని 36 ఏళ్ల మైనాంక్ పటేల్‌గా గుర్తించారు. సాలిస్‌బరీ పోస్ట్ ప్రకారం, 2580 ఎయిర్ పోర్ట్ రోడ్డులోని టుబాకో హౌస్ యజమాని పటేల్‌పై మంగళవారం దాడి జరిగింది.
కాల్పుల విషయం తెలియగానే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన పటేల్‌ను ఆసుపత్రికి తరలించారు. అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి రోవాన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ఓ కుర్రాడిని అదుపులోకి తీసుకుంది. అతను మైనర్ కావడంతో పేరును వెల్లడించలేదు. నిందితుడిని మంగళవారం రోజే పోలీసులు అరెస్ట్ చేశారు.
టుబాకో హౌస్ స్టోర్ నుంచి కాల్పులకు సంబంధించి ఫోన్ కాల్ వచ్చిందని రోవాన్ కంట్రీ షెరీఫ్ పబ్లిక్ ఇన్‌ఫర్మేషన్ ఆఫీసర్ కెప్టెన్ మార్క్ మెక్ డానియల్ వెల్లడించారు. పోలీసులు అక్కడకు చేరుకొని… గాయాలతో బాధపడుతున్న పటేల్‌ను చూశారు. వెంటనే అతనిని నోవాంట్ హెల్త్ రోవాన్ మెడికల్ సెంటర్‌కు తరలించారు. అక్కడి నుంచి చార్లెట్‌లోని ప్రెస్బిటేరియన్ ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు.
వీడియో ఫుటేజీలో నల్లటి షర్ట్, నల్లటి హుడీ, నల్లటి స్కై మాస్క్, వైట్ నైక్ టెన్నిస్ షూస్ వేసుకొని ఓ వ్యక్తి సంఘటన స్థలం నుంచి వెళ్లిపోతున్నట్లుగా ఉంది. అతను నల్లటి తుపాకీని పట్టుకున్నట్లుగా వీడియో ఫుటేజీలో ఉంది. నిందితుడు అక్కడికి కచ్చితంగా ఎందుకు వచ్చాడో తెలియనప్పటికీ… దోపిడీ కోసం వచ్చినట్లుగా ప్రాథమికంగా అభిప్రాయపడుతున్నారు.