- మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఘటన
- మా నాన్న ఆడుకోనివ్వట్లేదంటూ పోలీసులకు బుడతడు ఫిర్యాదు
- నెట్టింట వైరల్‌గా మారిన వీడియో
మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో 5 ఏళ్ల బుడ్డోడు తన తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లాడు. ‘మా నాన్న నన్ను నదిలో స్నానం చేసేందుకు వెళ్లకుండా ఆపుతున్నాడు. బయట వీధుల్లో ఆడుకోనివ్వట్లేదు’ అని తండ్రిపై పిల్లాడు ఫిర్యాదు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వీడియోలోని దృశ్యాల ఆధారంగా.. ఆ పిల్లవాడు ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అక్కడి ఓ కుర్చీపై కూర్చోవడం వీడియోలో ఉంది. అతని ముందు (టేబుల్‌కి ఎదురుగా) ఒక పోలీసు అధికారి కూర్చుని ఉన్నాడు. పోలీసులు అతని పేరు, ఎవరిపై ఫిర్యాదు చేయాలనుకుంటున్నావు? నేరం ఏంటని? ఆ బుడ్డోడిని అడగడం వీడియోలో కనిపించింది. ఇక పోలీస్ అధికారికి సమాధానమిస్తూ, పిల్లవాడు తన పేరు చెప్పడం.. నదికి వెళ్లకుండా, వీధిలో ఆడుకోకుండా తండ్రి అడ్డుపడుతున్నాడని వివరించడం మనం వీడియోలో చూడొచ్చు.
ఈ వీడియోను సురేశ్ సింగ్ అనే ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) ఖాతాదారు షేర్ చేశారు. అతను ఈ వీడియోకు “మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో ఐదేళ్ల పిల్లవాడు తన సొంత తండ్రిపై ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు. నదిలో స్నానానికి వెళ్తున్న చిన్నారిని తండ్రి ఆపి మందలించాడు. కోపంతో ఆ పిల్లవాడు తండ్రిపై ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్‌కు చేరుకున్నాడు” అనే క్యాప్షన్ రాయడం జరిగింది. దాంతో బుడ్డోడి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.