- 2021లో ప్రారంభం కావాల్సిన జనగణన కరోనా కారణంగా వాయిదా
- నాటి నుంచి పలుమార్లు వాయిదా పడిన జనగణన
- 2026 మార్చి నాటికి పదిహేనేళ్ల డేటాను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న హోంశాఖ
మన దేశంలో జనాభా లెక్కల కార్యక్రమం సెప్టెంబర్ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ కార్యక్రమం 2021లో జరగాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా సెప్టెంబర్ నెల నుంచి జనగణన చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
జనగణన కనుక సెప్టెంబర్ నెలలో ప్రారంభమైతే ఈ సర్వే పూర్తి కావడానికి ఏడాదిన్నర సమయం పట్టే అవకాశముంది. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి తుది ఆమోదం రావాల్సి ఉంది.
కేంద్ర హోంశాఖ, కేంద్ర గణాంకాల శాఖ జనగణనను చేపడతాయి. జనగణన కోసం ఈ శాఖలు కాలపరిమితిని నిర్ణయించుకున్నాయని, 2026 మార్చి నాటికి పదిహేనేళ్ల డేటాను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. దీనిపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, గణాంకాల శాఖ నుంచి ధ్రువీకరణ రాలేదు.
జనగణన, జాతీయ జనాభా నమోదు ప్రక్రియ కోసం ఈసారి బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ రూ.1,309.46 కోట్లను కేటాయించారు. 2021-22లో రూ.3,768 కోట్లు ప్రతిపాదించినప్పటికీ ఆ దిశగా అడుగులు పడలేదు.