- చైనా-తైవాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు
- చైనా విమానాలు తమ మధ్యస్థ రేఖను ఉల్లంఘించాయన్న తైవాన్ రక్షణమంత్రిత్వశాఖ
- అప్రమత్తమైన తైవాన్ సాయుధ దళాలు
తాజా పరిణామాలు చూస్తుంటే తైవాన్ చుట్టూ చైనా మరింతగా ఉచ్చు బిగిస్తున్నట్టుగా ఉంది. తమ భూభాగానికి సమీపంలో 41 చైనా యుద్ధ విమానాలు, ఏడు నౌకలను గుర్తించినట్టు తైవాన్ రక్షణ మంత్రిత్వాశాఖ తెలిపింది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను ఇది మరింత పెంచింది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ), పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీ (పీఎల్ఏఎన్) తమ దేశం చుట్టూ మోహరించి ఉన్నట్టు పేర్కొన్న తైవాన్ రక్షణశాఖ.. 32 విమానాలు సున్నితమైన మధ్యస్థ రేఖను దాటి తమ ఈస్టర్న్ ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్‌లోకి ప్రవేశించినట్టు పేర్కొంది. దీంతో అప్రమత్తమైన తైవాన్ సాయుధ దళాలు దీనిని నిశితంగా గమనిస్తున్నాయి. తమ గగన తలాన్ని కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాయి.
పీఎల్‌ఏకు చెందిన 8 విమానాలు, ఆరు నౌకలను తమ భూభాగ సమీపంలో తైవాన్ రక్షణ మంత్రిత్వశాఖ నిన్ననే గుర్తించింది. ఈ ఉదయం మరిన్ని విమానాలు, నౌకలు కనిపించడంతో అప్రమత్తమైంది. విమానాల్లో మూడు సున్నితమైన మధ్యస్థ రేఖను ఉల్లంఘించినట్టు తైవాన్ ఆరోపించింది. తైవాన్‌ను స్వతంత్ర దేశంగా అంగీకరించేందుకు ఇష్టపడని చైనా దానిపై కన్నేయడంతో తరచూ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొంటూనే ఉన్నాయి. దీనికితోడు తైవాన్‌కు అమెరికా అండగా ఉండడం కూడా చైనాకు కంటగింపుగా ఉంది. ఈ నేపథ్యంలో తరచూ తైవాన్‌పై దండెత్తేందుకు ప్రయత్నిస్తూ ఉంది.