Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

ఉక్రెయిన్‌పై ర‌ష్యా క్షిపణి దాడి.. 51 మంది మృతి!

  • ఉక్రెయిన్‌లోని పోల్టావాలో సైనిక విద్యా కేంద్రంపై రష్యా క్షిపణి దాడి
  • 51 మంది మృతిచెంద‌గా, మ‌రో 200 మందికి గాయాలు
  • ‘ఎక్స్’ వేదిక‌గా దాడిపై స్పందించిన అధ్య‌క్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ

ర‌ష్యా మ‌రోసారి ఉక్రెయిన్‌పై విరుచుకుప‌డింది. తాజాగా ఉక్రెయిన్‌లోని సైనిక విద్యా కేంద్రంపై రష్యా క్షిపణి దాడికి పాల్ప‌డింది. ఈ దాడిలో సుమారు 51 మంది మృతిచెంద‌గా, మ‌రో 200 మందికి పైగా గాయపడ్డారు. ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయాన్ని ఉటంకిస్తూ ప్ర‌ముఖ న్యూస్ ఏజెన్సీ సీఎన్ఎన్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. 

ఈ దాడిపై ఉక్రెయిన్ అధ్య‌క్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా స్పందించారు. పోల్టావాలో ఒక విద్యా సంస్థ, సమీపంలోని ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకుని రష్యన్ ద‌ళాలు ఈ దాడికి పాల్ప‌డిన‌ట్టు తనకు సమాచారం అందిందని అన్నారు. ఇక ఈ దాడి కార‌ణంగా టెలికమ్యూనికేషన్స్ ఇనిస్టిట్యూట్ భవనాలలో ఒకటి పాక్షికంగా ధ్వంసం అయిన‌ట్లు ప్రెసిడెంట్ పేర్కొన్నారు.

“పోల్టావాలో రష్యా దాడిపై నాకు ప్రాథమిక నివేదికలు అందాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రెండు బాలిస్టిక్ క్షిపణులు ఆ ప్రాంతాన్ని తాకాయి” అని జెలెన్‌స్కీ అన్నారు. అలాగే మృతుల‌కు తన హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేశారు.

అటు పోల్టావా రీజియన్ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ హెడ్‌ ఫిలిప్ ప్రోనిన్ టెలిగ్రామ్ ద్వారా తాజాగా మృతుల‌ సంఖ్యను వెల్ల‌డించారు. రెస్క్యూ సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లిలో శిథిలాలను తొల‌గిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. శిథిలాల కింద మరో 18 మంది వరకు ఉండవచ్చని ప్రోనిన్ తెలిపారు. కాగా, సైనిక విద్యా సంస్థలో కనీసం 10 నివాస భవనాలు దెబ్బతిన్న‌ట్లు పేర్కొన్నారు.

ఈ ఘ‌ట‌న‌పై ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ విచారణకు పిలుపునిచ్చారు. ఈ సంద‌ర్భంగా రష్యా దాడి త‌ర్వాత త‌మ‌కు సహాయం చేస్తున్న వారికి ఆయ‌న కృతజ్ఞతలు తెలిపారు.

“ఏం జరిగిందో అన్ని పరిస్థితులపై పూర్తి, సత్వర విచారణకు ఆదేశించాను. అన్ని ఎమ‌ర్జెన్సీ బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌లో పాలుపంచుకున్నాయి. దాడి తర్వాత సహాయం చేస్తూ, ప్రాణాలను కాపాడుతున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞత‌లు తెలుపుతున్నాను” అని జెలెన్‌స్కీ అన్నారు. ఈ సంద‌ర్భంగా తమకు మ‌రిన్ని ఫైట‌ర్ జెట్స్‌ను అందించాల్సిందిగా పాశ్చాత్య మిత్ర‌దేశాల‌ను జెలెన్‌స్కీ కోరారు. అప్పుడే ర‌ష్యాను దీటుగా ఎదుర్కోగ‌ల‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

Related posts

తప్పిన యుద్ధ ప్రమాదం.. వెనక్కు తగ్గిన ఇరాన్, ఇజ్రాయెల్

Ram Narayana

600 మంది ఉద్యోగులను తొలగించిన యాపిల్ కంపెనీ

Ram Narayana

దుబాయ్‌ లాటరీలో భార‌తీయ మ‌హిళ‌కు జాక్‌పాట్..!

Ram Narayana

Leave a Comment