ఎంత సంపాదించినా జీవిత చరమాంకంలో తన అన్నవాళ్లు ఎవరూ పట్టించుకోకుంటే ఆ బాధ వర్ణనాతీతం. ముఖ్యంగా కడుపున పుట్టినవారు కూడా ఆదరించకపోతే అది దిగమింగుకోలేని బాధ. చైనాలోని షాంఘైకు చెందిన టాన్ అనే 93 ఏళ్ల వ్యక్తికి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఆయన అనారోగ్యంగా ఉన్న సమయంలో ఎవరూ పట్టించుకోలేదు. పిల్లలు కూడా దగ్గరకు తీసుకోలేదు. అయితే గూ అనే తన సహోద్యోగి, అతడి కుటుంబం చాలా బాగా చూసుకుంది. దీంతో తనను అంత బాగా చూసుకున్న గూ కుటుంబానికే సంరక్షణ బాధ్యతలను కూడా టాన్ అప్పగించాడు. బదులుగా తన మరణానంతరం తన ఫ్లాట్‌ను, అందులోని వస్తువులను ఇస్తానని మాట ఇచ్చాడు. తన పిల్లలకు ఎలాంటి సంబంధం లేదని టాన్ వీలునామా రాశాడు.
అయితే అనూహ్యంగా టాన్ 93వ ఏట రెండవ పెళ్లి చేసుకున్నాడు. దీంతో కథ మొత్తం అడ్డం తిరిగింది. గూ కుటుంబానికి ఫ్లాట్ ఇస్తానంటూ గతంలో తాను రాసిన వీలునామాను రద్దు చేసుకుంటానంటూ ఆ పెద్దాయన కోర్టు మెట్లు ఎక్కాడు. తన సంరక్షణకు బదులుగా ఇస్తానన్న ‘ఫ్లాట్ గిఫ్ట్’ను రద్దు చేయాలని అభ్యర్థించాడు. అయితే అతడి నిర్ణయాన్ని కోర్టు తిరస్కరించింది. వీలునామా ఒప్పందాన్ని వెనక్కి తీసుకునేందుకు విచారం వ్యక్తం చేస్తున్నానని, తన నిర్ణయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని టాన్ చెప్పినప్పటికీ కోర్టు అంగీకరించలేదు.
కాగా 2005లో టాన్, గూ కుటుంబం మధ్య సంరక్షణ ఒప్పందం కుదిరింది. తన పట్ల, తన ఆరోగ్యం పట్ల వారు చూపిస్తున్న శ్రద్ధకు బదులుగా తన ఫ్లాట్‌ను వారికి రాసిస్తానని హామీ ఇచ్చాడు. వీలునామా కూడా రాశాడు. ఒప్పందంలో భాగంగా టాన్‌కు గూ కుటుంబ సభ్యులు రెగ్యులర్‌గా ఫోన్ కాల్స్ చేస్తుండాలి. వారానికోసారి వెళ్లి చూడాలి. అంతేకాదు కిరాణా సరుకులు, దుస్తులు కొనివ్వాలి. టాన్ అనారోగ్యంతో ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలనే నిబంధనలు ఇందులో ఉన్నాయి.
తన పిల్లల కంటే గూ కుటుంబ సభ్యులే తన పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించారని, అనారోగ్యం నుంచి కోలుకోవడానికి తనకు ఎంతగానో సాయం చేశారని ఆ సమయంలో టాన్ పేర్కొన్నాడు. తన పిల్లలతో సత్సంబంధాలు లేవని టాన్ పేర్కొన్నాడు.