- ఆడి ఇటలీ అధినేత ఫాబ్రిజియో లాంగో కన్నుమూత
- పర్వతారోహణ చేస్తూ పదివేల అడుగుల ఎత్తు నుండి పడి మృతి
- ప్రమాదంపై విచారణ జరుపుతున్న పోలీసులు
పర్వతారోహకులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ప్రమాదాలకు గురి అవుతుంటారు. ఈ ప్రమాదాల్లో కొందరు గాయాలతో బయటపడుతుండగా, మరి కొందరు ప్రాణాలు కోల్పోతుంటారు. తాజాగా ఇటాలియన్ – స్విస్ సరిహద్దుకు సమీపంలో పర్వతారోహకుడు ప్రమాదవశాత్తు పదివేల అడుగుల ఎత్తు నుండి కింద పడి మరణించారు. అడమెల్లోని పర్వతాన్ని అధిరోహిస్తున్న ఆడి ఇటలీ అధినేత ఫాబ్రిజియో లాంగో.. ప్రమాదవశాత్తు లోయలోకి పడినట్లు సమాచారం.
ఫాబ్రిజియో లాంగో లోయలో పడిపోవడాన్ని గమనించిన తోటి పర్వతారోహకులు రెస్క్యూ బృందానికి సమాచారం అందించారు. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. 700 అడుగుల లోయలో ఫాబ్రిజియో లాంగో మృతదేహాన్ని రెస్క్యూ టీమ్ గుర్తించి వెలికి తీసింది. అనంతరం అతని మృతదేహాన్ని హెలికాఫ్టర్ లో కారిసోలోలోని ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం అతని మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.