Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

బుడమేరు విజయవాడకు శాపంగా మారింది: పవన్ కల్యాణ్

  • బుడమేర 90 శాతం ఆక్రమణకు గురైందన్న పవన్ కల్యాణ్
  • క్లిష్ట పరిస్థితుల్లో చంద్రబాబు సమర్థవంతంగా పని చేస్తున్నారని కితాబు
  • వైసీపీ నేతలు విమర్శలు మాని సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచన

బుడమేరులోని 90 శాతం ఆక్రమణకు గురైందని, ఇదే ఇప్పుడు విజయవాడకు శాపంగా మారిందని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. అమరావతిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు సమర్థవంతంగా పని చేస్తున్నారని కితాబునిచ్చారు.

ఈ వయస్సులో కూడా జేసీబీలు, ట్రాక్టర్లను ఎక్కి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన బాగా పని చేస్తుంటే ప్రశంసించాల్సింది పోయి వైసీపీ నేతలు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ముందు సహాయక చర్యల్లో పాల్గొని, ఆ తర్వాత విమర్శలు చేయాలని వైసీపీ నేతలకు సూచించారు.

తాను వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించకపోవడంపై పవన్ కల్యాణ్ వివరణ ఇచ్చారు. తాను ఆ ప్రాంతాలకు వెళ్తే సహాయక చర్యలకు ఇబ్బందులు వస్తాయన్నారు. అధికార యంత్రాంగంపై ఒత్తిడి ఉంటుందని చెప్పడం వల్ల తాను వెళ్లడం లేదన్నారు. తాను పర్యటించకపోవడంపై వైసీపీ నేతలు విమర్శలు చేయడం సరికాదన్నారు.

వైసీపీ నేతలు తనతో వస్తానంటే తన కాన్వాయ్‌లోనే తీసుకు వెళ్తానన్నారు. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలని వ్యాఖ్యానించారు. ఇది ఏ ఒక్కరి సమస్య కాదని, రాష్ట్రానికి చెందిన అంశమన్నారు. కాబట్టి వైసీపీ నేతలు సహాయం చేసిన తర్వాత మాట్లాడాలని హితవు పలికారు.

సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నట్లు తెలిపారు. సహాయక చర్యల్లో పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది కూడా పాల్గొంటుందన్నారు. 175 బృందాలు విజయవాడ పట్టణ ప్రాంతంలో పని చేస్తున్నట్లు తెలిపారు. వరద ప్రభావం లేని జిల్లాల నుంచి 900 మంది పారిశుద్ధ్య కార్మికులు వచ్చారన్నారు. వరదల కారణంగా ఎక్కువగా ఎన్టీఆర్ జిల్లా దెబ్బతిన్నట్లు చెప్పారు. 26 ఎన్డీఆర్ఎఫ్, 24 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పని చేస్తున్నాయన్నారు. నేవీ నుంచి 2, ఎయిర్ ఫోర్స్ నుంచి 4 హెలికాప్టర్ల ద్వారా ఆహారాన్ని పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.

Related posts

కాంగ్రెస్ నేత పొంగులేటితో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ

Drukpadam

కేసీఆర్ నివాసానికి చేరుకున్న జగన్.. ఆహ్వానం పలికిన కేటీఆర్

Ram Narayana

టీడీపీ దాడులతో భయానక వాతావరణం నెలకొంది.. గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలి: వైఎస్ జ‌గ‌న్

Ram Narayana

Leave a Comment